ఇంగ్లీషు చదువుల చరిత్ర -Reprint from Eemata online Telugu magazine of January-March 2020. Original was published in Krishna Patrika 1941 March to July
ఇంగ్లీషు చదువుల చరిత్ర 1
రచన: దిగవల్లి వేంకట శివరావు
జనవరి 2020
I
చెన్న పట్టణమున సుప్రీము కోర్టులో 1819 మొదలు 1835 వరకు ఇంటర్‌ప్రిటరు (ట్రాన్సులేటరు)గానుండిన ఏనుగుల వీరాస్వామయ్యగారును ఆరోజులలో పోలీసు డిప్యూటి సూపరెండెంటు మేజస్ట్రీటు పదవుల నందిన వి. రాఘవాచార్యులుగారును కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళెగారును 1827 సంవత్సరము నుండి 1853 సంవత్సరము వరకు మద్రాసు సుప్రీము కోర్టులో అడ్వకేటు జనరలుగా పనిచేసిన జార్జి నార్టనుగారి నాయకత్వమున దక్షిణ హిందూ దేశమున యింగ్లీషు విద్యావిధానమును స్థాపించుటకు అఖండమైన సేవ చేసిరి.
జార్జి నార్టనుగారి వలెనే చెన్నపట్టణమున సదరు అదాలత్ కోర్టులో గవర్నమెంటు ప్లీడరుగను సుప్రీముకోర్టులోను తరువాత మదరాసు హైకోర్టులోను అడ్వకేటు జనరలుగను పనిచేసి భారత దేశీయులపట్ల అత్యంత సానుభూతిగలిగి దేశీయులలో విద్యాభివృద్ధి గావించుటకును, రాజకీయ పరిజ్ఞానము కలిగించుటకును పాటుపడుచు, పచ్చయప్ప కళాశాల ధర్మములకు ముఖ్య ధర్మకర్తగా (patronగా) నుండి ప్రతి సంవత్సరోత్సవమున దేశీయుల సుద్బోధించుచు ఇరువదియయిదు సంవత్సరములు ప్రజాసేవ చేసిన జాన్ బ్రూస్ నార్టన్‌గారి పట్ల మదరాసు పౌరులు తమ కృతజ్ఞతను తెలుపుటకు, పచ్చయప్ప కళాశాలాభవనమున 1868 సంవత్సరం మార్చి నెలలో ఒక మహాసభ జరిసి వారి ఛాయాపటమును బహిర్గతము చేయు సందర్భమున ఈ జాన్ బ్రూస్ నార్టనుగారు మాట్లాడుచు – పూర్వము జార్జి నార్టను వీరాస్వామయ్య ప్రభృతులు చేసిన అపారమైన సేవను గూర్చి ఇట్లు కొనియాడిరి.
“…ఈ సందర్భములో నాపటమునకు ఎదురుగా నున్న రూపపటములోని జార్జి నార్టనుగారిని గూర్చి నేను కొంచము ప్రశంసింపక విరమింపజాలను. ఈ దేశములో విద్యాభివృద్ధి కొరకు నాకన్న ఆయన ఎక్కువ ముఖ్యకారకుడు. ఆయన యొక్క దూరదృష్టి పట్టుదల ఆయన తెలివితేటలు మతవిషయములతో సంబంధము లేని లౌకిక ఆంగ్లేయ విద్యాస్థాపనమునుగూర్చి ఈ దక్షిణ దేశమున జరిగిన దీర్ఘమైన గొప్ప పోరాటమును చేసి తుదకు విజయము గాంచినవి. ఈ పచ్చయప్పగారి విద్యాసంస్థను స్థాపించుట కుపయోగింపబడిన మూలధనమును తినుచు కూర్చున్నవారి దగ్గరనుండి బయటకు లాగి సంపాదించిపెట్టిన దితడే. ఈ పాఠశాల యొక్క వృద్ధికిని ఉన్నతస్థితికిని కారణభూతములయిన నిబంధనలను చేసినదియు నితడే. క్రిందటి తరములోని తెలివి గల నేటీవు(దేశీయు)లును దేశీయవిద్యాభివృద్ధికి జనకులును అని చెప్పతగినవారును, ఆయనతో పాటు ఈ చిత్రపటములోనే చిరస్మరణీయులుగ చిత్రింపబడి యున్నవారును ఆయిన వి. రాఘవాచార్యులు, ఏనుగుల వీరాస్వామయ్య (కోమలేశ్వరపురం) శ్రీనివాస పిళ్ళె గార్లను ఆయన దగ్గరకు చేరదీసి ప్రోత్సహించినాడు. సంఘసామ్యమునకు పునాది తల్లులేయనియు అందువలన స్త్రీ విద్య అత్యవసరమనియు గ్రహించి శ్రీనివాస పిళ్ళెగారు ఆడపిల్లల పాఠశాల నొకటి స్థాపించినాడు. ఇంగ్లీషు రాజ్యాంగమును గూర్చియు భారతదేశమున బ్రిటిషు పరిపాలనమును గూర్చియు ఆతడిచ్చిన అమూల్యమైన ఉపన్యాసములను గూర్చి నొక మారు మీకు జ్ఞాపకము చేయుచున్నాను.” అనిరి.
ఏనుగుల వీరాస్వామయ్య
ఏనుగుల వీరాస్వామయ్యగారు చెన్న పట్టణమున పందొమ్మిదవ శతాబ్దారంభమున నుండిన సుప్రసిద్ధ ఆంధ్రప్రముఖులలో ఒకరు. ఈయన ఆంధ్రనియోగి బాహ్మణుడు. తండ్రి పేరు సామయమంత్రి. ఈయన స్వయంకృషి చేత పయికి వచ్చినవారు. తొమ్మిదవ యేటనే తండ్రినిగోల్పోయి వీధిబడిలో చదువుకొని తెనుగు, అరవము, సంస్కృతము నభ్యసించి, ఇంగ్లీషు నేర్చుకొని కుంఫిణీవారి కొలువులో వాలంటీరుగా ప్రవేశించి తన తెలివితేటలవలన వివిధములైన ఉద్యోగములందు పైవారిని మెప్పించిరి. ఆనాడు మదరాసులో నేటి హైకోర్టుకు పూర్వముండిన సుప్రీముకోర్టులో ఇంగ్లీషుకు అరవము నుండి తెనుగునుండి తర్జుమా చేయుటకు ఇంటర్‌ప్రిటరను ఉద్యోగము ఖాళీరాగా అది వీరి బంధువులున్నూ సదరు కోర్టులో ఇంటర్‌ప్రిటరు ఉద్యోగము చేయుచున్న వారునూ అయిన వెన్నెలకంటి సుబ్బారావుగారికి ఇచ్చెదమని దొరలు చెప్పగా ఆ సుబ్బారావుగారి సిఫారసు పైన 1819లో వీరాస్వామయ్య గారికివ్వబడినది. అప్పటినుండి సుప్రీము కోర్టులో ప్రధాన న్యాయమూర్తులుగా ఉద్యోగము చేసిన దొరలందరి యొక్కయు మన్ననలకు పాత్రులయి 1835 వరకు ఆ యుద్యోగమును చేసి ఉపకార వేతనమునంది 1836 సంవత్సరము అక్టోబరు 3 తేదీన దివంగతులైరి. ఈయన జన్మవత్సరము తెలియలేదు. పింఛను పుచ్చుకొనునాటికి ఏబది సంవత్సరములుండునని యోచించిననుగూడ ఆయన 1780లోనో అంతకు పూర్వమో జన్మించియుండవలెనని తోచుచున్నది. వీరాస్వామయ్యగారు కన్యాకుమారి నుండి కాశ్మీరమువరకును రెండుమారులు భారత దేశమున పర్యటనము జేసిరి. తాము చూచిన సంగతులు లేఖలుగను దినచర్యగను 1830-31లో వ్రాసిరి. ఇది కాశీయాత్ర యను పేరున 1838లో ప్రకటించబడినది. వీరాస్వామయ్యగారు గొప్ప ప్రజాసేవకులు పరోపకార పారీణులు, చెన్న రాజధానిలో ఇంగ్లీషు విద్యాభివృద్ధికి, చాలా పొటుపడిరి. హిందూ లిటరరీ సొసైటీ అను ప్రజాసంఘమును స్థాపించి ప్రజాసేవ చేసిరి.
క్రీ. శ. 1832లో నందన సంవత్సరమున వచ్చిన ఘోరక్షామములో తాము స్వయముగా అన్నాతురులకు అన్నప్రదానము చేయటయే గాక బీదలను గాపాడుటకు సత్రములు పెట్టించి రాత్రింబవళ్లు అన్నప్రదానము చేయించిరి. వీరాస్వామయ్యగారికి ఇంగ్లీషు తెనుగు అరవములందు సంస్కృతమునందు మంచి పాండిత్యముండెను. అనేక పండిత సభలయందు వారు వాదించి గెలుపొందిరి. వీరాస్వామయ్యరుగారు రచించిన కాశీయాత్రచరిత్రను 1838లో అచ్చు వేయించిన వీరిమిత్రులైన కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళెగారు వీరి జీవితసంగ్రహమును రచియించి దానిలో చేర్చిరి.
భారతదేశము ఇంగ్లీషువారి వశమగునాటికి మొగలు సామ్రాజ్యము విచ్ఛిన్నమై రాజకీయ విప్లవముల వలన యుద్ధముల వలన చాలచోట్ల పూర్వము నాటి రాజ్యాంగ కట్టుబాటులు సడలిపోయి పరిపాలనా విధానము కుంటువడినను దేశములో శాంతిభద్రతలు తగ్గి ప్రభుత్వ ఉద్యోగులు లంచగొండులై ప్రజలను పీడించుట ప్రారంభమై దేశ దారిద్ర్యము హెచ్చినను దేశములో పెద్ద పట్టణములందు చిన్న గ్రామములందు సైతము పూర్వకాలమునాటి విద్యాపద్దతులు అమలు జరుగుచునేయుండెను. 1757 మొదలు 1813 వరకును కుంఫిణీ వారు దేశప్రజలవలన పన్నులు వసూలు చేసి అమితలాభము సంపాదించుచుండినను, ప్రజల విద్యాభివృద్ధి విషయమున నెట్టిజోక్యమును కలిగించుకొనలేదు. పూర్వకాలపు ప్రభుత్వములు రాజులు అధికారులు విద్యాపోషణ కొరకిచ్చిన వర్షాజనములు, యీనాములు, జాగీరులను, వీరు మన్నించిన వారు కారు. అందువలన పోషణ లేక విద్య అభివృద్ధిగాక నానాటికి క్షీణించినది. దేశప్రజలలో విద్యాభివృద్ధి చేయుట అవసరమని 1813లో పట్టానిచ్చునప్పుడు పార్లమెంటు వారు హెచ్చరించి దానికొరకొక లక్షరూపాయిలు ఖర్చు పెట్టవలసినదని శాసించినను కుంఫిణీ వారు త్వరలో అట్టి ప్రయత్నము చేయలేదు.
దేశములో తెలివికలవారు కొందరు స్వతంత్రముగా ఇంగ్లీషు భాష నేర్చుకొని,దాని లాభమును గ్రహించి ఇంగ్లీషు విద్యావిధానమును స్థాపింపుడని పోరసాగిరి. 1823లో రామమోహనరాయలిట్లు కోరుచు, ఆ నాటి గవర్నరు జనరలైన ఆమహరెస్టుకు బహిరంగ లేఖ వ్రాసి బిషపు హెబ్బరుగారికిచ్చి పంపెను. ఇది ఇంగ్లాండులో కుంఫిణీ డైరెక్టర్ల కందచేయబడెను. తరువాత ఆంగ్లేయ విద్యావిధానమును స్థాపించుటకు ప్రభుత్వమువారు చేసిన నిర్ణయమునకిది తోడ్పడినది. ఎట్టకేలకు కుంఫిణీ వారు విద్యాభివృద్ధినిగురించి యోచింపదలచిరి. దేశీయులకు పూర్వపువిజ్ఞానము నేర్పు పాఠశాలలు స్థాపించవలెనా? లేక ఇంగ్లీషు భాషను పాశ్చాత్య శాస్త్రవిజ్ఞానమును నేర్పు పాఠశాలలు స్థాపింపవలెనా అను విషయమును గురించి చర్చలు బయలు దేరెను. అది తీర్మానించుటకు ముందుగా దేశములోని ప్రాతవిద్యావిధానము లే స్థితిలో నున్నవి? ప్రజల అక్షరజ్ఞాన మెట్లున్నది? అని విచారించుటకు వివిధ రాష్ట్రములందు విచారణ చేయసాగిరి.
చెన్న రాష్ట్రమున గవర్నరుగా నుండిన నర్ తామస్ మన్రోగారు 1822-26 మధ్య వివిధ జిల్లాకలెక్టరుల చేత ఈ విషయమును గురించి విచారణ చేయించిరి. దాని వలన నానాటికి మన రాజధానిలో పాఠశాలకుబోవు ఈడుగల బాలుర సంఖ్యలో దరిదాపుగా ఆరవవంతు మంది ఏదోవిధమగు విద్య నేర్చుచుండిరని అంచనా వేయబడినది. ఆనాటికి 12948 గ్రామపాఠశాలలున్నట్లును తేలినది. ఇట్లే బొంబాయిలో 1823-28 మధ్య జరిగిన విచారణవలన ఎనిమిదిమంది బాలురలో ఒకడు విద్య నేర్చినట్లు తేలినది. వంగ రాష్ట్రమున పురుషులలో నైదవవంతు చదువగలవారనియు, 1835 నాటికి వంగరాష్ట్రమున ఒక లక్ష గ్రామములున్నట్లును తేలినది. ఇది కుంఫిణీ వారి ప్రయోజకత్వముకాక ప్రజలలో స్వయంకృషి వలన నేర్పడియున్న పరిస్థితులు.
II
దేశమున ఆనాడుండిన పాఠశాలలు అనేక విధములు. పూర్వకాలముననుండిన ఆర్యవిజ్ఞానమున సంస్కృత భాష వేదశాస్త్రములు నేర్పు విద్యాపీఠములు గురుకులములు బౌద్ద విహారములు పోగా వాని స్థానమున గొప్ప పండితులు స్థాపించి నడుపుచున్న గొప్ప పాఠశాలలు కాశీ, నవద్వీపము మొదలగు పట్టణములయందుండెను–హిందువుల సామాన్య గ్రామపాఠశాలలు ప్రతి గ్రామమునందుండెను.
మధ్యకాలమున అనగా మహమ్మదీయులకు పూర్వము తరువాతను దేశములోని వర్తకుల యొక్కయు రైతుల యొక్కయు పిల్లలకు చదువుట, వ్రాయుట లెఖ్కలు నేర్పుటకు పట్టణములందు పల్లెలందు స్థాపించబడిన మహాజన పాఠశాలలని ప్రసిద్ది చెందిన ప్రాథమిక పాఠశాలలు మసీదులనంటి స్థాపించబడిన ‘మక్తాబులు’ను మద్రసాలనబడు పాఠశాలలును మహమ్మదీయ పాఠశాలలుగ నుండెను. ఈ వివిధ పాఠశాలల చరిత్ర చాలా చిత్రమైనది.
పూర్వము నాటి తక్షశిల, ఉజ్జయిని, కాశీ మొదలగు విద్యాపీఠములను పాహియాన్ హూనిత్యాంగు మొదలైనవారు దర్శించిరి. ప్రతి బౌద్ధవిహారము నొక విద్యాలయముగ నుండెను. అందు వేదశాస్త్రములు లౌకిక విద్యయు చతుష్షష్టి కళలకు సంబంధించిన విద్యయు, సాహిత్యమును సంగీతము, జ్యోతిశ్శాస్త్రము వైద్యము గూడ నేర్పబడుచుండెసు, ప్రతి తీర్థమునందును దేవస్థలమునందును గల సామాన్య గురుకులములకు లెక్కలేదు—ఇవిగాక గ్రామములందు సంస్కృత దేశ భాషలను బోధించు బడులుండెను. వీనిని ‘పంచాయతులు నడుపు’చుండెను.
మొగలు ప్రభుత్వమునకు పూర్వము తురుష్కరాజులు మద్రసాలు స్థాపించియుండిరి. ఫిరోజిషా కాలమున (1393) హిందువులు పారషీ భాష చదువుట అనేక హిందూ గ్రంథములు పారషీలోని కనువదింపబడుట, ఆ నాటి విద్యాభివృద్ధిని చాటుచున్నవి. ఈ పద్దతి దక్షిణమున బీజాపురము గోలకొండ వరకునూ వ్యాపించెను. మొగలు చక్రవరులీ పద్ధతుల నెల్ల చక్కగా నిర్వహించిరి. ఇది గాక ప్రతి మసీదునంటి క్రొత్త మక్తాబు లనబడు పాఠశాలలు స్థాపించిరి. ప్రతి నెల కింతయనిగాక వర్షాజనములును, రొక్కరూపమున బహుమతులును ఈనాములు జాగీరులిచ్చి పోషించిరి. ప్రాథమిక మాధ్యమిక విద్య చక్కగా అభివృద్ధిలో నుండెను. అక్బరు కాలమున దేశీయ సారస్వతములు మహోన్నతి జెందెను. ఔరంగజేబు చనిపోయిన పిదప గూడ ఇంగ్లీషు వారి పరిపాలన ప్రారంభ మగుపరకును ఈ మక్తాబులును మద్రసాలును హిందువుల గ్రామపాఠశాలలను గూడ చక్కగా జరుగుచుండెను.
కుంఫిణీ ప్రభుత్వము వచ్చినపిదప ‘దేశీయ రాజుల రాజ్యములందు’ ప్రాత పద్దతులు చక్కగా జరుగుతుండగా, ఇంగ్లీషు వారివశమైన రాజ్యభాగములందు మాత్రము తగిన పోషణము లేక విద్యాసంస్థలు క్షీణించి పోవుచుండెను. రాజ్యపరిపాలనమును కట్టుదిట్టము చేయుట కొరకు 1793లో గ్రామపంచాయతుల అధికారము తీసివేసి దేశమును జిల్లాలుగా విభజించి కలెక్టర్లను జడ్జిలను నియమించుటతో గ్రామపంచాయతులు నాశనమై, వాటితోపాటు గ్రామ పాఠశాలలును చాలవరకు నశించెను. పూర్వపు ఈనాములు పోయెను. ఉపాధ్యాయులు వేరు వృత్తులు చూచుకొనసాగిరి. వేరే జీవసము లేనివారు మాత్రము బడి పంతుళ్ళుగా మిగిలిరి. అందువలన నీ విద్యాపద్దతులు పాడై విద్య అధోగతిలోనికి దిగినది.
భారత దేశములో మొట్టమొదట ఆంగ్లేయులతో పరిచయము కలిగి స్నేహము చేసిన తరువాత వంగ రాష్ట్రమున ప్రాముఖ్యత వహించిన కొన్ని గొప్ప కుటుంబములకు మూల పురుషులుగ నుండినవారు దుబాషులుగనో దివానులుగనో, ఆంగ్లేయుల కొలువునందు జేరినవారై యున్నారు. ఉదాహరణము: దక్షిణదేశమున ఆనందరంగ పిళ్ళె, పచ్చయ్యప్పలవలె వంగరాష్ట్రమునకు రాజా నబకిష్ణదేవుగారొకడు. ఈయన క్లయివు వారన్ హేస్టింగ్సులకును సురాజుద్దౌలా మీర్జాఫరుల మధ్యను రాయబారములను నడిపిన దుబాషి. రాజా రాధాకాంత దేవుగారీయన వంశీయుడే. క్లయివు దివానగు రామచంద్ర గోవిందరామును ఉమచందు జగత్సేటులును, మహారాజా నందకుమారుడును ఇంగ్లీషు నేర్చుకొనకయే యీ కుంఫిణీ అధికారులతో వ్యవహారములు చేసినారు. రెండవ తరములోనివారు చెన్న పట్టణమున వెన్నెలకంటి సుబ్బారావు గారు ఏనుగుల వీరాస్వామయ్య గార్ల వలె వంగరాష్ట్రమున కలకత్తా మొదలగు ముఖ్యపట్టణములలో నుండిన ఇంగ్లీషు వారిదగ్గరను యూరేషియనుల దగ్గరను అర్మీనియనుల దగ్గరను ప్రయివేటు పాఠశాలలు స్థాపించిన ఇతర ఇంగ్లీషు దొరలవద్దను ప్రయివేటుగా ఇంగ్లీషుభాష నేర్చుకొని ఉద్యోగములు చేయసాగిరి. ఆంగ్లేయవిద్య యొక్క లాభములు వీరు గ్రహించి తమపిల్లల కావిద్య నేర్పించవలెనని ప్రయత్నించుచుండిరి. కాని ఆనాటి కుంఫిణీ ప్రభుత్వము నేటీవులయందు ఇంగ్లీషువిద్యను వ్యాప్తి జేయుటకు ఇచ్చగింపలేదు. పైగా దానిని ప్రతిఘటించెను. తుట్టతుదకు 1813లో కుంఫిణీవారికి కొత్త పట్టానిచ్చునప్పుడు ఇంగ్లీషువిద్యను ప్రోత్సహించునట్లు పార్లమెంటువారు శాసించిరి. అంతట కొందరు మిషనరీలుకూడా కొంత సాయము చేయవచ్చిరి.
ఆనాడు కలకత్తాలో ప్రాముఖ్యత వహించిన కటుంబములకెల్ల రాజా రామమోహనరాయలు పెద్దగా నుండెను. రవీంద్రనాథుని తాతయగు ద్వారకనాథ టాగూరుగారును ప్రసన్నకుమార టాగూరు గారునూ, బంగాళాబ్యాంకి దివానును కేశవచంద్రసేనుని పూర్వీకుడును అగు రామ్ కమలసేనుగారును బ్రోకరు అగు రస్యోమణిదత్తుగారును ప్రముఖులుగ నుండిరి. రాజా రామమోహనరాయలు స్థాపించిన బ్రహ్మసభకు వ్యతిరేక పక్షమగు సనాతనధర్మసభకు అధ్యక్షులయిన రాజా రాధాకాంత దేవుగారును గొప్ప దేశీయ నాయకులే. తరువాత వంగరాష్ట్ర నాయకుడయిన రామగోపాల ఘోషు, కెల్‌సాల్ ఘోషు కంపెనీలో భాగస్తులు వీరందరును ఇంగ్లీషు విద్య నేర్చి తమతోడి ప్రజల యందు విద్యాభివృద్ధి సంఘసంస్కరణమును కలిగించుటకు 19వ శతాబ్దాదియందు పాటుపడుచుండిరి.
రామమోహన రాయలుగారును డేవిడ్ హేర్ అను నొక దొరయు రాజా రాధాకాంత దేవు మొదలగు ప్రముఖులును కలిసి 1817లో హిందూ కాలేజి యను ఒక ఇంగ్లీషు విద్యాలయమును స్థాపించిరి. రామమోహనరాయలు స్వతంత్రముగా ఆంగ్లోవర్ణాక్యులరుస్కూలను నొక పాఠశాలను నడుపుచుండెను. ఇట్లింగ్లీషు పాఠశాలలో తరఫీదు పొందిన మొదటితరమువారు తయారైరి. ఇట్లు బ్రిటిష్ ప్రభుత్వము వారీదేశమున ఆంగ్లేయ విద్యావిధానమును ప్రవేశపెట్టుటకు పూర్వమే మన దేశీయలే ఈ విద్యాపద్దతిగోరి స్వతంత్రకృషి చేసిరి. కుంఫిణీవారీ కొత్త పద్ధతుల కిష్టపడక పూర్వపద్ధతులకే తోచిన సాయము చేయుచుండిరిగాని చాల కాలము వరకు ఇంగ్లీషు విద్యాభివృద్ధికి తగిన పని చేయలేదు. జనసామాన్యమునకు చదువులు నేర్పుట తమపని కాదని యుపేక్షించుచుండిరి. ప్రజలకు మెహర్బానీకొరకు మెప్పుకొరకు 1791వ సంవత్సరమున గవర్నరు జనరలగు వారన్ హేస్టింగ్సు కలకత్తాలో ఒక మహమ్మదీయ కళాళాలను స్థాపించెను. 1792లో కారన్ వాలీసు కాశీలో ఒక సంస్కృత విద్యాలయమును స్థాపించెను. చాల కాలము వరకు దేశీయ ప్రజల పూర్వవిజ్ఞానమే ప్రోత్సహించవలెనను ఊహ ప్రబలియుండెను. మహమ్మదీయ పరిపాలనమున పారషీ భాషను హిందువులు నేర్చుకొని పెద్దయుద్యోగములు చేయుచుండినట్లే ఈ ఇంగ్లీషు కుంఫిణీ ప్రభుత్యమున ఇంగ్లీషుభాషను నేర్చుకొని పెద్ద ఉద్యోగములు చేయవచ్చునని తోచి దేశములో వివిధ ప్రాంతములందు గొప్ప కుటుంబములవారనేకులు తమ పిల్లలకు ప్రయివేటుగా ఇంగ్లీషు చెప్పుచుండిరి. వంగరాష్ట్రమున రామ మోహన రాయలువారును చెన్న రాష్ట్రమున వెన్నెలకంటి సుబ్బారావుగారు, ఏనుగుల వీరాస్వామయ్యగారు మొదలయినవారును ఈ విధముగ స్వతంత్రముగ ఇంగ్లీషు విద్య నభ్యసించినవారే. ఇంగ్లీషు విద్య కావలెనను కోరిక వంగరాష్ట్రములోను చెన్నరాష్ట్రములోనుకూడా ముఖ్యులగు భారతీయులకు కలిగి దానిని గూర్చి ప్రయ్యత్నము చేయసాగిరి.
III
1820లో మదరాసు స్కూలుబుక్కుసొసయిటీకి సదరు కోర్టు ఇంటర్‌ప్రిటరగు శ్రీ వెన్నెలకంటి సుబ్బారావుగారు ఇంగ్లిషులో నొక దీర్ఘమైన లేఖ వ్రాసి ఈ దేశమునందు పాఠశాలలను సంస్కరించి ఆంగ్లేయవిద్యను వ్యాపింప జేయుడని ప్రభుత్వమువారిని కోరియుండిరి. ఈ లేఖ ఈ సొసైటీ వారి ప్రథమ నివేదికలో 1823లో ప్రకటింపబడినది. ఈ దేశములో వెంటనే ఆంగ్లేయ విద్యావిధానమును స్థాపింపుడని కోరుచు రాజా రామమోహన రాయలవారు 1823 డిశంబరు 12వ తేదీన గవర్నరు జనరలైన ఆమహరెస్టు ప్రభువుగారికి ఇంగ్లీషులో దీర్ఘమైన లేఖను వ్రాసి బిషప్ హెబరుగారిద్వారా పంపెను. ఈ లేఖలోని భావములకా బిషప్పుగారు మెచ్చుకొనిరి. ఆ లేఖలోని విషయములకు భారతదేశ ప్రభుత్వమువారును ఇంగ్లాఁడులోని కుంఫిణీ డైరెక్టరులును ప్రభుత్వమువారును తగిన విలువనిచ్చి గౌరవించినట్లు అనేక నిదర్శనములున్నవి.
ఇట్లు 1823 నాటికి బుద్ధిమంతులగు భారతీయులలో ఆంగ్లేయవిద్య నేర్చుకొనవలెనను వాంఛయు దేశములో ఇంగ్లీషువిద్యావిధానమును స్థాపించి ప్రజలలో విద్యాభివృద్ధి చేయవలెనను కోరికయు గాఢముగానుండెను. ఇట్టిస్థితిలో నీ దేశమున క్రైస్తవ మతప్రచారము చేయవచ్చిన మిషనరీలింకొక కారణమున ఆంగ్లవిద్యావిధానమును స్థాపించుటకు పూనుకొనిరి. చాలకాలము నుండి క్రైస్తవమతాచార్యులు దేశీయులలో చేయుచున్న ప్రచారము సక్రమముగా ఫలింపకపోవుటకును, తగినంతమంది క్రైస్తవులు గాకపోవుటకును గల కారణము హిందూ మహమ్మదీయ ప్రజలలో పూర్వసిద్ధాంతములు గట్టిగా పాదుకొని యండుటయే యనియు, చిన్నపిల్లలకు చదువు నెపమున క్రైస్తవ సిద్దాంతములు బోధించినచో వారి మనస్సులను క్రైస్తవమతమును స్వీకరించుటకు సుముఖముగ జేయవచ్చుననియు, చర్చి ఆఫ్ స్కాట్లాండు మిషనరీలు నిశ్చయించి హిందూదేశములో పాఠశాలలందు విద్యను బోధించుట ద్వారా క్రైస్తవమతబోధ చేయు ప్రచారకులను బంపుటకు నిశ్చయించిరి. అట్లువచ్చిన మిషనరీలలో ప్రముఖుడు అలెగ్జాండర్ డఫ్. ఇతడు 1830వ సంవత్సరము మే నెల 27వ తేదిన కలకత్తాకు వచ్చెను. ఇట్లే బొంబాయికి రాబర్టు నెస్బిట్‌గారు పోయి విద్యాగురువులైరి. జాన్ ఆండర్‌సన్ అను యువకుడు 1837 సంవత్సరం ఏప్రియలు 3వ తేదిన ఇట్లే చెన్న పట్టణమునకు క్రైస్తవమిషనరీగా వచ్చెను. వీరందరును ఒకే పద్ధతి నవలంబించిరి. ఆనాడు గవర్నరు జనరలుగానుండిన విలియం బెంటింకుగారు అధికారరీత్యా తాను క్రైస్తవప్రచారమునకు సహాయము చేసిన బాగుండదనియు, వ్యక్తిగతముగ చేయతగిన సాయమెల్ల చేయుదుననియు 1830లోనే డఫ్ దొరకు వాగ్దానము చేసియుండెను.
ఈ వాగ్దానము నతడు త్వరలోనే చెల్లించుకొనెను. చెల్లించుకొనుటలో పైన చెప్పిన లోటు కనబరచక అధికారరీత్యా పైకి క్రైస్తవమత ప్రచారమునకు సాయము చేయుచున్నట్లు కనపడని విధముగా కొన్ని పనులును, బహిరంగముగా కొన్ని పనులును చేసినాడు. 1833వ సంవత్సరమున కుంఫిణీవారికి కొత్త పట్టానొసగునప్పుడు పార్లమెంటువారీ దేశమున కొక లా మెంబరును లా కమీషనరును నియమించిరి. ఆ సూచన ప్రకారము ప్రభుత్వ సభ్యుడుగా వచ్చిన మెకాలేగారును విలియం బెంటింకుగారును దేశ ప్రజలయందు ఇంగ్లీషుభాషను ప్రవేశపెట్టినచో వారింగ్లీషు ప్రభుత్వమునకును ఇంగ్లీషు సభ్యతకును దాసులగుదురను తలంపుతోను, క్రైస్తవమతప్రచారము కూడ జరుగునను ఆలోచనతోను హిందూదేశమునందు ఆంగ్లేయ విద్యావిధానమును, ఇంగ్లీషు సాహిత్యమును, ప్రకృతి శాస్త్రవిజ్ఞానమును స్థాపించుటకు 7-3-1835 తేదీ నిర్ణయించిరి. ముందుగా ప్రభుత్వ కార్యాలయములయందు ఇంగ్లీషు భాష ప్రవేశ పెట్టుటకును పెరిషియన్ భాష తీసివేయుటకును విలియం బెంటింకు తగుఉత్తరువుల జేసెను. ఇట్లే దేశీయ వైద్యవిధానమునకు బదులు పాశ్చాత్య వైద్యవిధానమును స్థాపించుటకును నిశ్చయించిరి.
దీనితో ఇంగ్లీషు యుగమొకటి ప్రారంభమయ్యెనని చెప్పవచ్చును. అయినను కుంఫిణీ ప్రభుత్వమువారు దేశమునందు ఆంగ్లేయ విద్యావిధానమంత త్వరితముగా ప్రవేశపెట్టలేదు. ఇది జరుగునప్పటికి చాలాకాలము పట్టెను. మిషనరీలు మాత్రము అనేక ఇంగ్లీషు కాలేజీలు స్థాపించి మతప్రచారము చేయసాగిరి.
ఇంగ్లీషు కాలేజీలలోను పాఠశాలలలోను పరీక్షలందుత్తీర్ణులైన వారికి ప్రభుత్వోద్యోగము లివ్వబడునని 1844లో హార్డింజిగారు ప్రకటించుటతో ఆంగ్ల విద్యా విధానము స్థిరముగా నాటుకొనెను.
ఇక చెన్న పట్టణములోని స్థితిగతులను కొంచెము పరిశీలింతము. 1813లో ఇంగ్లాఁడు ప్రభుత్వమువారు భారతదేశమును పరిపాలించుటకు మరల ఇరవై సంవత్సరములకు కుంఫిణీ వారికి కొత్త పట్టానిచ్చినప్పుడు హిందూ దేశ ప్రజల జ్ఞానాభివృద్ధికొరకును నైతికాభివృద్ధి కొరకును కొన్ని నిబంధనలు చేయుట అవనరమని పైకి చెప్పుచు నిజమునకు క్రైస్తవ మతప్రచారము చేయు నుద్దేశ్యముతో పార్లమెంటువారు భారత దేశ ప్రజల జ్ఞానాభివృద్ధి నిమిత్తమొక లక్ష రూపాయిలు ఖర్చుపెట్టునట్లు శాసించిరిగాని కుంఫిణీ వారట్లు చేయుటకు భయపడి దీనిని గురించి ఎట్టిచర్యను దీసికొనలేదు. అందువలన ఏ విధమైన పాఠశాలలు స్థాపించబడలేదు. పైన చెప్పిన పట్టా నిచ్చుటలో హిందూ దేశమునకు క్రైస్తవ మిషనరీలు ధారాళముగా పోయి మతప్రచారము చేసికొనవచ్చునని పార్లమెంటు వారు శాసించినందున మిషనరీలు విద్యాబోధనము ద్వారా ప్రజల మనసులను తమ మతము వైపుకు తిప్పుకొని క్రమక్రమముగా హిందువులను క్రైస్తవులుగా చేయవచ్చునను తలంపుతో భారత దేశమునకు వచ్చి పాఠశాలలు స్థాపించుటకు నిశ్చయించిరి గాని అది అంత త్వరలో జరుగు కార్యము కానందున కొంత కాలము వరకు విద్యాభివృద్ధి యథాస్థితిలోనే యుండెను.
ఆంగ్లేయులీ దేశమునకు కొత్తగా వచ్చినప్పటి నుండియు నీ కాలమువరకును కుంఫిణీ వారెట్టిసాయము చేయకపోయినను మన దేశీయులు ఇంగ్లీషు నేర్చుకొనుటకు కొంత స్వతంత్రమైన కృషి చేసియుండిరి!
విజాతీయ క్రైస్తవ మిషనరీలును ఆర్మీనియనులును ఇతర అయిరోపా దేశీయులు మరికొందరును మన దేశమునకు వచ్చి ఇంగ్లీషు నేర్చుకొనదలచు ధనికులకు ఇంటిదగ్గర పాఠములు చెప్పుచు చిన్న చిన్న పాఠశాలలు కూడా అక్కడక్కడ స్థాపించిరి. వీరిదగ్గర నేర్చుకొన్న వారు కొందరు ఉపాధ్యాయులు బయలుదేరిరి గాని మొత్తముమీద ఇంగ్లీషు చదువులు అభివృద్ధి చెందుటకు తగిన అవకాశములు లేకుండెను. ఇక దేశీయ బాలురు చదువు నేర్చుకొను పాఠశాలలు చాల దుఃస్థితిలో సున్న వీధిబడులు. వీనియందు చెప్పబడు చదువు నేడు పెద్దబాలశిక్షలో మనము చూచు విషయములని చెప్పవచ్చు. ఇప్పటికిని నైజాములో కొన్ని మారుమూల గ్రామములందీ పద్దతి చూడవచ్చును. ఈ పాఠశాలలందలి పరిస్థితులను శ్రీచిలకమర్తి లక్ష్మీనరసింహము పంతులుగారు రామచంద్ర విజయము, గణపతి అను నవలలందు వర్ణించియున్నారు.
1820 సంవత్సరము నాటికి చెన్నపట్టణములో నుండిన పాఠశాలల యొక్క స్థితిని గూర్చి ఆనాడు మదరాసు సదరు కోర్టులో ఇంటర్‌ప్రిటరుగా నుండిన వెన్నెలకంటి సుబ్బారావుగారు మదరాసు స్కూలుబుక్సు సొసయిటీవారి కోరిక పైన ఆ సంఘ కార్యదర్శికి వ్రాసిన దీర్ఘమైన ఇంగ్లీషు లేఖలో చక్కగా వివరింపబడియున్నది. దానిలో వారిట్లు వ్రాసిరి:- చెన్న పట్టణములో దరిదాపుగా అన్ని వీధులలోను చాలా పాఠశాలలున్నవి. వానిలో ముగ్గురికి తక్కువగాకుండగను యాభైమందికి ఎక్కువగాకుండగను అన్ని కులముల పిల్లవాండ్రును చదువుకొనుచుందురు. మదరాసులోని తెలుగుబడులందలి ఉపాధ్యాయులు ఉత్తరాది నుంచి ఆహ్వానింపబడిన బాహ్మణులుగా నున్నారు. ఈ రాజధానిలోని గ్రామములన్నిటిలోను వీధిబడులు కలవు. పిల్లలను ఐదవయేటనే బడిలో వేయుదురు. వారికి గుంట ‘ఓనమః’లు, ఐదుబడులు గుణింతము బాల రామాయణమును చెప్పుచుందురు. తాటియాకులపై గంటముతో వ్రాయట, లెక్కలు, ప్రభవలును వీరికి నేర్పుచుందురు. అయితే వ్యాకరణము మాత్రము వీరికి నేర్పుట లేదు. ఆడపిల్లలు సాధారణముగా ఈ బడులందుచదువుకొనరు గాని భోగమువాండ్ర ఆడపిల్లలు మాత్రము చదువుకొనుచున్నారు. బడిపంతులు పడుకష్టమునకు తగిన ఆదాయము లేదు. వారిజీవనము గడుచుటయే కష్టముగా నున్నది. గ్రామములోని పిల్లలు తల 1కి రు. 0-4-0లు కంటే చెల్లించరు. చెన్న పట్టణములో తల 1కి ఒక రూపాయి చాలా పెద్ద జీత మనవచ్చును. ఈ దేశము పరిపాలించిన పూర్వపు అధికారులు బడిపంతుళ్లకు రొక్కపు బహుమతులును, భూరూపకమైన ఈనాములును ఇచ్చుచుండిరి. గొప్పవారి పిల్లల చదువు పూర్తి అయిన తరువాత వీరికి బహుమతులు ముట్టుచుండెను. కలవారు పిల్లలను పాఠశాలలకు పంపుదురు. లేనివారు యింటి వద్దనే చదువు చెప్పుచుందురు. ఈ పిల్లలు నేర్చుకొను చదువు కొద్ది పాటిదే యయినను తరువాత కచ్చేరీలలో చేరినప్పుడు పై ఉద్యోగుల తరిఫీదు పొందుచు ఈ లోటును పూర్తిచేసుకొనుచుందురు. బడులందు లెక్కలు కూడ చెప్పుచున్నారు గాని అది అంత బాగ లేదు. నీతిబోధకమైన పుస్తకములు వారిచే చదివించుచున్నను వానియొక్క నిజార్థములు వారికి బోధింపబడుటలేదు. సంస్కృతము బోధించుబడులందు మాత్రము ఆభాషాభ్యాసమునందే వ్యాకరణము నేర్పుట తప్పనిసరి యగుచున్నది. దేశభాషలు బోధించుటలో కూడ నీ జాగ్రత్త యుండినచో బాగుండెడిది. గొప్ప వారికుటుంబములందు ఉపాధ్యాయులకు మంచి జీతములిచ్చి పిల్లలకింటి దగ్గరనే చదువు చెప్పించుచున్నారు. ఈ ఉపాధ్యాయులు ఇతరులకు చదువు చెప్పకూడదు.
ఇక నీ దేశపు నేటీవులకు ఇంగ్లీషు భాషను బోధించు విధానమును వర్ణించెదను. తన స్వభాష నేర్చుకొనుట ప్రారంభించిన పిదప ఇంకొక భాషను పలాని వయస్సులో నేర్చుకొనవలెనను నియమము లేదు. ఈ దేశములో అరువదేండ్లవాండ్రు కూడ ఇంగ్లీషు నేర్చుకొనుటను ప్రారంభించుట నేను స్వయముగా నెరుగుదును. హిందూ దేశీయుడు ఇంగ్లీషుపాఠశాలలో జేరగనే ముందుగా ఇంగ్లీషు అక్షరములు నేర్చుకొనును. సాధారణముగా ప్రతిదినము ఉదయము ఉపాధ్యాయుడొక స్పెల్లింగు బుక్కునుండి యొకపాఠమును వకబ్యులరీలో నొక పాఠమును నేర్పించును. డయలాగు అను పరస్పరభాష సంభాషణలు పూర్వకాలపు ఉపాధ్యాయులు పిల్లల కొరకు తయారు చేసినవానినుండి ఒక పాఠమును ఇచ్చుచుండును. ఒక విద్యార్థి నూరు మాటలు నేర్చుకొని కొంచెము దస్తూరీ బాగుగా వ్రాయగలిగినంతనే ఏదో ఒక కచ్చేరిలో ముందుగా (మేదువారీ) వాలంటీరుగా ప్రవేశించును. క్రమముగా ఆతడు తన బంధువుల ప్రాపకము వల్ల ఒక చిన్న జీతముగల ఉద్యోగము సంపాదించును.
జిల్లాలలో ఇంగ్లీషు నేర్చుకొను విద్యార్థులు చదువు పుస్తకములు వకబ్యులరీ, డయలాగు, అరేబియను నైట్సు మాత్రమే. బహుశః వ్యాకరణము వారికి తెలియదనియే నా నమ్మకము. నేను చెప్పిన వకబ్యులరీ డయలాగులు కూడా నిర్దుష్టమయినవనియు వ్యాకరణయుక్తములైనవనియు ఒక విద్యార్థి తప్పులు లేకుండా యింగ్లీషు మాట్లాడుటకు చాలినట్టివనియు నేను చెప్పుటలేదు.
అందువలన రాజధాని నగరములోను జిల్లాలలోను ప్రస్తుతము అమలులోనున్న యింగ్లీషు నేర్చు విధానము నిజమైన విద్యాభివృద్ధికి తోడ్పడునట్టిది కాదు. ఇప్పుడు మదరాసులో నున్న యింగ్లీషు ఉపాధ్యాయులలో చాలమందికి వ్యాకరణము తెలియదనియే నా అభిప్రాయము. కొన్ని యేండ్ల కిందట మదరాసులో మూడు నాలుగు పాఠశాలలకన్న హెచ్చుగా లేనప్పుడు ఈ ఉపాధ్యాయుల రాబడి కొంచెము బాగుగ నుండెను గాని ఇప్పుడు వాని సంఖ్య చాలా హెచ్చి ఉపాధ్యాయులకు జీవనము గడచుటయే కష్టము గానున్నది.
దేశములోని వివిధ భాషలలో విద్యాభివృద్ధి చేయుటకు ఆయా భాషలందు వ్యాకరణములను నీతికథలను లెక్కలను గణితశాస్త్రమును గురించిన పుస్తకములు తయారు చేయుట అవసరమని నాయభిప్రాయము. ఆలాగుననే యింగ్లీషు పాఠశాలలకొరకు ఇంగ్లీషు వ్యాకరణమును ఆ యా భాషలందు బోధించటయు, ప్రపంచచరిత్ర ఆ యా భాషలలోనికి అనువదించుటయు సామాన్య ఇంగ్లీషు సంభాషణలను తర్జుమాచేయించుటయు ఇంగ్లీషుభాషలోను తక్కిన భాషలలోను వకబ్యులరీలు నిర్మించుటయు మంచిభాషాంతరీకరణములలో చక్కని కథలను ప్రచురించుటయు అవసరము అని వెన్నెలకంటి సుబ్బారావుగారు 1820వ సంవత్సరం నవంబరు 22వ తేదీ తమ లేఖలో వ్రాసిరి.
(సశేషం)
[ప్రథమ ప్రచురణ: కృష్ణాపత్రిక, శ్రీ విక్రమ సంవత్సర ఫాల్గుణ మాసపు (మార్చి, 1941) సంచికలలో. ఈ వ్యాసాన్ని అందజేసిన దిగవల్లి రామచంద్రగారికి మా కృతజ్ఞతలు – సం.]
ఇంగ్లీషు చదువుల చరిత్ర 2
రచన: దిగవల్లి వేంకట శివరావు
ఫిబ్రవరి 2020
IV
మదరాసు రాజధానిలో విద్యాభివృద్ధినిగూర్చి విచారణ చేయుటకు 1820లో మదరాసు గవర్నరైన సర్ తామస్ మన్రోగారు వివిధ జిల్లాలలోని కలెక్టరులను ఆయాజిల్లాలయందుగల పరిస్థితులను తనకు తెలుపవలసినదని ఉత్తరువు చేసెను. వారిచ్చిన సంజాయిషిలును సుబ్బారావుగారు చెప్పినట్లే యుండెను. పూర్వపు విద్యాపద్ధతులు నశించిపోయినందున అప్పటికి నిలిచియున్న పద్ధతులు సుబ్బారావుగారు వ్రాసిన దుస్థితిలోనికి దిగియున్నందునను చెన్న రాజధానిలో విద్యావిధానమును సంస్కరించుట యవసరమని మన్రోగారు నిశ్చయించి కొన్ని యింగ్లీషు పాఠశాలలను నెలకొల్పుటకు 1826లో నొక ప్రణాళికను తయారుచేయించిరి గాని అది అమలులో పెట్టకపూర్వమే 1827లో వారు చనిపోయిరి. అంతటితో నీ ప్రయత్నము నిలిచిపోయెను.
ఇట్లు 1830 ఆప్రాంతముల నాటికి విద్యాభివృద్ధిని గూర్చియు చేయవలసిన పని ఎంతోయుండెను. కాని నాటి భారతీయులకు తమదేశమును పరిపాలించుచున్న కుంఫిణీవారి యధికారముల గురించిగాని ఇంగ్లాండుదేశము యొక్కయు తమదేశము యొక్కయు చరిత్రను గురించి గాని రాజ్యాంగ పద్ధతులను గురించి గాని తెలియదు. తమను పరిపాలించు అధికారుల వలన తాము విద్యావిషయమునందు శాంతిభద్రతల విషయమునందు కొన్ని సౌకర్యములు పొందుటకు తమకు హక్కు కలదని గాని ఈ దేశమునుండి వసూలు చేయుచున్న పన్నులు ఈ దేశాభివృద్ధి కొరకు ఖర్చుపెట్టమని కోరుటకును తుదకు దేశమును గాఢముగా ఆవరించియున్న అవిద్యాంధకారమునైనను మాన్పి ఇంగ్లీషుభాషను పాశ్చాత్య విజ్ఞానమును బోధించు పాఠశాలలు స్థాపించుమని కోరుటకును తమకు అధికారము కలదని యైన వీరెరుగరు. తమకు కావలసిన సౌకర్యములగూర్చి ఎవరి నడుగవలెనోకూడ వీరికి తెలియదు. ఈ విషయములను గూర్చి ప్రజలలో కొంత ప్రచారము చేసి సంస్కరణముల కొరకు ప్రయత్నించునట్లు చేయవలెనన్నచో ముందుగా ప్రజలకు పైన చెప్పిన విషయములను గురించి తమ పౌరసత్వ హక్కులను గురించి వారికి బోధించవలసియుండెను. ఒక్క మదరాసు రాజధానియందేగాక భారతదేశమందలి యన్నిచోటులను గూడ ప్రజలీస్థితిలోనే యుండిరి. వంగరాష్ట్రమునందు ప్రజల యదృష్టవశమున మహానాయకుడగు రామమోహనరాయలు బయలుదేరి సంఘసంస్కరణమునకు రాజకీయసంస్కరణములకొరకు పనిచేయుటలో దారి దీసెను. ఆంగ్లవిద్యాస్థాపన చేసి పాశ్చాత్య విజ్ఞానమును వ్యాపింపజేయుటకు పాటుపడి కృతకృత్యుడైనాడు.
చెన్నరాజధానిలో జార్జి నార్టనుగారు వీరాస్వామయ్యగారును వారి మిత్రులును వంగరాష్ట్రమున రామమోహనరాయలవారు చేసినంత మహత్తర ప్రజాసేవ చేయలేకపోయినను విద్యాభివృద్ధి విషయమున మాత్రము అంతటిపని చేసినారని చెప్పక తీరదు.
వీరాస్వామయ్యగారు చెన్నపట్టణములోని పురప్రముఖులను దర్శించి విద్యాభివృద్ధి కొరకు పాటుపడుటకు పెద్దలందరు కలిసి పనిచేయుట అవశ్యకమనియు పురప్రముఖులొక సంఘముగా నేర్పడి కృషి చేసినచో తమ కోరికలు సిద్ధించగలవనియు నచ్చచెప్పి తమ స్వంతపని కొరకువలె కష్టపడి హిందూ లిటరరీ సొసైటీ అను నొక ప్రజాసంఘమును స్థాపించిరి. ఈ సంఘముయొక్క ఆధిపత్యము క్రింద అనేక మహాజనసభలు గావించి అనేక విషయముల గురించి ఉపన్యాసములిప్పించి ప్రజలకు అనేక విషయములను గురించిన విజ్ఞానమును బోధించి ప్రజలలో ఒక విధమైన ఐకమత్యమును కార్యదీక్షను కలిగింపసాగిరి. ఈ సొసైటీవారి ఆధిపత్యము క్రింద ఆంగ్లేయోద్యోగుల కేర్పడిన సెంటు జార్జికోట కాలేజి భవనమున 1833-34 సంవత్సరములలో నేటివు పెద్దమనుష్యులు సమావేశమైన మహాసభలో వారికి జార్జి నార్టనుగారు భారతదేశ పరిపాలనము గురించి రాజ్యాంగమును గురించి న్యాయ పరిపాలనా విధానముల గురించి దేశచరిత్రను గురించియు కొన్ని మహోపన్యాసముల నొసగసాగిరి.
నార్టనుగారిచ్చిన ప్రారంభోపన్యాసమునకు నాటి మదరాసు గవర్నరు సర్ ఫ్రెడరిక్ ఆడంగారు కూడ వచ్చిరి. నార్టన్‌గారిట్లుపన్యసించిరి:–
“ఘనమైన అయ్యా, స్నేహితులారా!
నేను తృప్తికరముగా నిర్వహింపగలుగుదునని నాకు ధైర్యములేని పెద్దకార్యమును నేనిప్పుడు తలపెట్టితిని. కాని ఈ కార్యము ఎంతవరకు నెరవేరిననుగూడ దీనివలన చాలమందికి శాశ్వతమైన లాభము కలిగితీరును.
రాజ్యాంగ పద్ధతులు ధర్మపరిపాలనా పద్ధతులును ప్రజలు విధేయులై యున్న పరిపాలన విధానము యొక్క స్వరూప స్వభావములను దాని శాసనముల స్వభావమును న్యాయ పరిపాలన కేర్పరుపబడిన మార్గములను ఈ దేశీయ (నేటివు) జనసంఘమునకు విశదపరుప దలచితిని.
ఈ కార్యములో నాకుగల కష్టములను గూర్చి ఆలోచించియేయున్నాను గాని యిపుడు సాక్షాత్తుగా దీనిని ప్రారంభించునప్పుడు కొంచెము జంకును భయమును గలుగుచున్నవి. ఈ విషయమున నన్ను పురికొల్ప ప్రోత్సహించు ముఖ్యశక్తి (నేటివు) దేశీయ జనసంఘము నందలి ఉన్నత తరగతిలోని ప్రజలింతమంది యిచ్చట నా యుపన్యాసములను వినుటకువచ్చి ఇంత యుత్సాహము కుతూహలము కనబరచుచుండుటయే నేను పడు శ్రమవలన తాము పొందగలగిన లాభములెల్ల పొందుటకు కృతనిశ్చయులైన వీరికి ఉపన్యాసముల నిచ్చుటలో నాకుగల సంతోషమే తక్కిన భావముల నణచివేయుచున్నది.”
V
నార్టనుగారు ఇంకను ఇట్లు పలికిరి:-
“ఇంగ్లాండు ప్రభుత్వమును భారతదేశ కుంఫిణీ ప్రభుత్వమును గూడ కొన్ని సంవత్సరములనుండి చేయుచున్న శాసనములందు హిందూదేశీయులపట్ల ఆ ప్రభుత్వములు చూపుచున్న ఉదారభావమును మీరు గ్రహించితిరని నేనెరుగుదును. మీ దేశ సివిలు పరిపాలనమున ముఖ్యమైన పెద్ద యుద్యోగములు పొందుటకును మీ దేశముయొక్క శాసనములు అమలు పరుచుటలోను మీకిప్పుడు కలిగింపబడిన అవకాశములు వానిని మీరు చలాయించుటకు మీకు గల అర్హతలపైననే ఆధారపడియుండును. ఇట్లు రాజకీయముగను సాంఘికముగను మీస్థితి నభివృద్ధి చేసికొనుటకు మీకివ్వబడిన అవకాశమునకు మీరర్హులేయని చూపుటకు మీరు ముందంజ వేయుచుండుటయు నేనెరుగుదును. మీ ప్రయత్నములకు ఇంగ్లాండు ప్రభుత్వము ఇండియా ప్రభుత్వము కూడ ప్రోత్సాహమిచ్చునని నమ్ముడు. ఈ సమయమున ఈ సభలో గవర్నరుగారు హాజరై యుండుటయే దీనికి సాక్షి.
హిందూజనసంఘము తమలో విజ్ఞానాభివృద్ధి కలిగించుకొనుటకు చేసిన స్వయంకృషి ప్రయత్నము నొకదానిని గురించి నేనిక్కడ చెప్పవలసియున్నది. అది హిందూ లిటరరీ సొసైటీ స్థాపనము. దానియొక్క ప్రథమ ఫలితములలో నేనిక్కడ నిచ్చుచున్న ఉపన్యాసముల కార్యక్రమమొకటి. పరిపాలనకు సంబంధించిన రాజ్యనీతిశాస్త్రములు, న్యాయపరిపాలన సూత్రములు, ప్రభుత్వతత్వము, తాము బద్ధులైయుండు శాసనములు, ఆ శాసనముల అమలు, ముఖ్యముగా తెలిసికొనదగిన విజ్ఞానవిషయములని ఈసంఘమువారు తలచినందుకు నేను సంతోషించుచున్నాను. ఈ నమ్మకముతోనే ఈ సంఘముయొక్క సభ్యులలోని పెద్దలు కొందరు ఈ విషయములను గురించి తాము చదవవలసిన గ్రంథముల గూర్చియు ఇతరులకు చెప్పవలసిన మార్గముల గూర్చియు అప్పుడప్పుడు నాతో ఆలోచించుచుండిరి. ఈ విషయములకు సంబంధించిన విజ్ఞానమును అభ్యసించినవారికిని ఇంగ్లీషు సారస్వతమునందు మీ ప్రజలు యింతవరకు చేసిన కృషినిగూర్చి యెరిగినవారికిని నేను తృప్తికరమైన సలహాల నొసగలేకపోయితినని వేరుగ చెప్పవలసిన పని లేదు.
పాశ్చాత్యగ్రంథకర్తలు వ్రాసిన రాజ్యనీతిశాస్త్రములందును ధర్మశాస్త్రములందును ఈ సామ్రాజ్యమున జీవించు ప్రజల స్థితిగతులకు అనుగుణములైన సంగతులు గాన్పింపవు. ఇప్పుడు ప్రజలలోగల గ్రహణశక్తి యున్న స్థితిలోనవి సులభముగా అర్థములును కావు. ఈదేశీయులకు ప్రసాదించబడిన అవకాశముల లాభమును వారు పొందుటకు నేను చేయగల సాయమెల్ల చేయదలచితిని. ఈ విషయములనుగూర్చి నేను గ్రహించినదెల్ల మీకు చెప్పదలచితిని. ప్రజలకుపయోగించునట్లు సులభశైలిలో ప్రభుత్వపరిపాలనా విధానములు ధర్మశాస్త్రవిధులును మీ జన్మభూమియగు నీదేశములో నిప్పుడమలులోనున్న పరిపాలనావిధానము న్యాయపరిపాలనయు అర్థమగునట్లు చెప్పదలచితిని. నాసేవను మీరు గ్రహింపుడని కోరుచున్నాను. ఈ విషయములను గూర్చిన జ్ఞానము నభివృద్ధి చేసికొనుట, మీ యోగక్షేమములతో సంబంధించియున్న మీ జాతీయతకు చాలముఖ్యమని మీరు తలచునట్లుగా మీలో నట్టిభావమును కలిగించుటకైనను ప్రయత్నింతును. ఇకముందు మీరును మీతరువాతవచ్చు తరమువారును సాహిత్యజ్ఞానమునందు అభివృద్ధి చెంది అనుభవజ్ఞానమును సంపాదించి ఈ విషయములను మీకనువైన విధముగా గ్రంథములద్వారా నేర్చుకొనగలరు–ఈ విషయములను మనము గ్రహింపగలమా? ఈ కృషిని మనము చేయగలమా? అని మీరధైర్యపడనక్కరలేదు. ఈ సభాసదులకు నేనిప్పుడుపన్యసించునట్లు ఏడేండ్లక్రిందట బొంబాయిలోని ప్రజలకు నేనుపన్యసింప ప్రయత్నించియుండినచో నామాటల నర్థముచేసికొనగల నేటివులు ముగ్గురైన నక్కడ నుండెడివారని నాకు నమ్మకము లేదు. ఇప్పుడా నగరముననే మరల నేనుపన్యసింపదలచి శ్రోతలను ఆహ్వానించినచో అవి వినుటకు అత్యంత కుతూహలముతో తెలివిగలవారు ఒక వందమంది విద్యార్థులైనను నా యుపన్యాసమునకు వచ్చి యుత్సాహముతో వినెదరని నా విశ్వాసము. ఈ పరివర్తన మెట్లు కలిగినది? ఆ రాజధానిలో నేటివు ప్రజలలో ముఖ్యులకైనను మంచి ఇంగ్లీషువిద్య పాశ్చాత్యశాస్త్రవిజ్ఞానమును బోధించుట వలన లాభము కలుగునని గ్రహించి ఆ కార్యమును ప్రభుత్వముచేత చేయించిన ఒక దేశాభిమాని యొక్క తెలివితేటల వలనను కృషి వలనను జరిగినది” అని బొంబాయిలో ఇంగ్లీషు విద్యాభివృద్ధికి కారకుడైన మౌంట్ స్టూఆర్ట్ ఎల్‌ఫిన్‌స్టన్ అను గవర్నరు చేసిన సేవను ప్రశంసించిరి. “(1827లో) నే నారాష్ట్రమున నున్నప్పుడు అక్కడి దేశీయులకు గల ఇంగ్లీషు భాషాజ్ఞానమును సాహిత్యజ్ఞానమును నేను చూచినమట్టుకు (ఇప్పుడు 1833లో) ఇక్కడివారికిగల ఇంగ్లీషు భాషాజ్ఞానముతోను సాహిత్యజ్ఞానముతోను పోల్చిచూడగా ఇక్కడివా రచ్చటివారికి తీసిపోవువారు కారనియు, మీరే వారికన్న యెక్కువ తెలివిగలవారనియు నాకు తోచుచున్నది. అయితే అక్కడివారు ప్రజలలో విద్యాభివృద్ధిని చేయుటవలని లాభములను మీకంటె ముందుగా గ్రహించి ఇంగ్లీషు స్నేహితుల సహాయముతో అది చేసి దాని లాభములను పొందగలిగిరి. మీరింకను వెనుకబడియున్నారు” అని చెప్పిరి.
VI
తాను చెప్పబోవు రాజ్యాంగశాస్త్రవిషయములు కొంచెము కష్టమైన విషయములే గాని అవి అందరికి తెలియునట్టి సులభశైలిలోనే చెప్పగలనని చెప్పి నార్టనుగారు మరియు నిట్లనిరి–“ఈ విషయములన్నియు చాలా గొప్ప విషయములనియు సామాన్యులకివి సాధ్యమైనవి కావనియు మీ రధైర్యము చెందవలసిన పనిలేదు. మీ దేశముననే వివిధకాలములందు జన్మించి మీ చరిత్రలో ప్రసిద్ధులైన అనేకులగు జ్ఞానసంపన్నులు ప్రతిభాశాలురునగు మహామహుల జీవితములే మీకీ విషయమున ధైర్యము కలిగించగలవు.
“పూర్వకాలమునుండి ఈ క్షణమువరకును నిజమైన ధర్మశీలురు (Moralists) రాజ్యనీతి ధురంధరులు స్మృతికర్తలునని చెప్పతగిన వారనేకులు మీలో నుద్భవించియున్నారు. నేను గౌరవముతో నుల్లేఖింపతగు మనుష్యులింక నితర పూర్వ గ్రంథకర్తలు ననేకులున్నారు. ఇక మహమ్మదీయులు వివిధదేశములలో వృద్ధిచేసిన సారస్వత విజ్ఞాన మంద రెరిగినదే. వారివలన పాశ్చాత్యులు చాలా శాస్త్రములు పాఠములు నేర్చుకొన్నారు. ఈ మద్రాసులోనే దొరలలో ప్రారంభమైన ఇంగ్లీషు విద్యావిధానము ఇప్పుడు అయిరోపాలోనెల్ల ప్రసిద్ధి చెందియున్నది.
ఈ తూర్పుదేశములలో నిదివరకు వర్ధిల్లిన సిద్ధాంతములలో విజ్ఞానమునందు చాలా లోపములున్నవని అంగీకరించినను దీనికన్న పాశ్చాత్య విజ్ఞానము శ్రేష్ఠమని యెంచినను ఒక విధమయిన విజ్ఞానమును వర్ధిల్లచేసిన మేధ యీ దేశప్రజలందు కలదని మాత్రము స్పష్టము. ఇట్టి తెలివితేటలుగల పూర్వికులయొక్క వంశములవారేనా మీరు? వారికిగల తెలివితేటలు మీకు తక్కువైనవా? అవి కొరత పడలేదని నా అనుభవమే చెప్పుచున్నది. రామమోహనరాయలుగారిపేరు మీ రందరు వినియే యున్నారు. ఆయన ఇంగ్లీషులో మంచి పాండిత్యమును సంపాదించినాడనియు గొప్ప గ్రంథములు వ్రాసినాడనియు పేరుపొందిన సంగతి మీ రెరుగుదురు. ఈ దేశమును చక్కగా పరిపాలించు విధానములకును ఇక్కడ చక్కగా న్యాయవిచారణ చేయు పద్ధతులకును సంబంధించిన విషయములను గూర్చి ఇంగ్లాండులో అతిసమర్థులైన రాజ్యతంత్రజ్ఞులు ఆయనతో ఆలోచించి ‘వారి సలహా’ యొక్క లాభమును కొంతపొందినారని మీకు నేను గట్టిగా చెప్పగలను. నేను మీకు చెప్పదలచు విషయములను గురించి కృషి చేయుటకు వలసిన తెలివితేటలకు శక్తిసామర్థ్యములకు కొరతలేదని చెప్పుట కీయొక్క నిదర్శనమే చాలును” అని నార్టనుగారు పలికి దేశీయులలో గొప్ప ఆంగ్లేయులు గూడ మెచ్చుకొనినట్టి సలహాలనిచ్చిన మైసూరు మంత్రియైన పూర్ణయ్యగారి తెలివితేటలను యుదాహరణముగ చూపిరి. ఇంగ్లీషులో చక్కని మరణశాసనమును వ్రాసిన చిన్నతంబి మొదలియారును గూర్చి ప్రశంసించి హిందూ సమిష్టి కుటుంబమునందు సోమఱులై జీవించువారి నష్టము లనుభవించు పద్ధతిని చూసి 21సంవత్సరములు నిండగనే తమ స్వార్జితములతో వేరు వేరు ఇండ్లలో కాపురము చేయుచు కుటుంబములో కలహములు లేక స్వయంకృషి చేత స్వతంత్రముగా జీవింపుడని ఈ చిన్నతంబిగారు తన కొమాళ్ళని హెచ్చరించుచు అనేక నీతులను బోధించినారనియు ఈయన మాటలు స్వాతంత్ర్యమును స్వపరిపాలనమును స్వయంకృషిని బోధించుచున్నవనియు మూఢాచారముల దాస్యమునుంచి వెలువడుడని హెచ్చరించుచున్నవనియు మెచ్చుకొని ఈయనమాటలాయన పిల్లలకొరకే గాక దేశీయుల కందరికిని ఉపయోగింపగలవనిరి.
ఈ సందర్భమున ఇంగ్లీషుజాతియొక్క చరిత్రవలన నేర్చుకొనతగిన గుణపాఠములను చెప్పదలచి నార్టనుగారు ఇంగ్లాండును భారతదేశముతో పోల్చిరి. అంత చిన్నదేశము యొక్కజాతివారింత పెద్ద దేశముయొక్క ప్రజలను పరిపాలించుట కెట్లు శక్తులైరో నిరూపించిరి. వారియొక్క ఆయుధబలము వలనను వారు రాజ్యతంత్రముద్వారా గైకొనిన చర్యల వలనను విశాలమైన రాజ్యములు వారి యాధీనములగుటయు చెప్పి “ఒక మహాబలవంతునిక్రింద నున్నట్లుగా నీ విశాల సామ్రాజ్యము యొక్క శాఖోపశాఖలు శాంతిసౌఖ్యములతో వారివలన పరిపాలింపబడుటనూ మీరు చూచుచున్నారు. వారికి వాణిజ్యమునగల తెలివితేటల వలన దేశములో ధనము క్రొత్తవిధముగా ప్రవహించుచుండుట మీరు చూచుచున్నారు. క్రొత్త పరిశ్రమలు బయలుదేరుట క్రొత్త పెట్టుబళ్ళు స్థాపింపబడుటను మీరు చూచుచున్నారు. ఈ యద్భుతమంతయు నెట్లు సంభవించినదను ఆలోచన మీకు కలుగవచ్చును. మీరు కొంచెము యోచించినచో నొక క్షణములోనే దీని కారణములు మీకు బోధపడును.
“స్థిరమైన మంచి ప్రభుత్వమువలన, న్యాయములై చక్కగా అమలు జరుపబడు శాసనధర్మముల వలన ఈ జాతి ప్రజలిట్లు అభివృద్ధి చెందినారని మీకు తెలియగలదు. ఆత్మవిశ్వాసము వలన, మంచి శీలము వలన శాస్త్రవిజ్ఞానమునందు వృత్తికళలందు ప్రతివిషయముననుగూడ వీరు ప్రవీణులై ఇతరులకు అజేయులై సామ్రాజ్యములను స్థాపించినారు.
“బయటనుండి వచ్చు శత్రువుల వలనగాని దేశములో కలుగు అంతఃకలహముల వలనగాని కదల్చుటకు సాధ్యముగాని ఒక్క స్థిరమైన ప్రభుత్వముక్రింద నిప్పుడీ భారతదేశీయులు తమచరిత్రలో మొదటిసారి జీవించుచున్నారు. అయితే జాతులన్నిటిలోను గొప్పదగు నీ జాతితోడి కలయిక యెంతవరకు కేవలము అధికారబలముపైన నాధారపడు హక్కులుకాక, హెచ్చుఅధికారములును మీతోడిప్రజలు ఈవరకే అనుభవించుచు మీరిప్పుడు చూచు ఉన్నతస్థితికి వచ్చినందులకు కారణములైన స్వాతంత్ర్యములును, మీకు కూడా కలుగుటకు విస్తరించుటకు నుపయోగపడునో అనునది మీరిప్పు డీశ్వరేచ్ఛవలన లోబడియున్న ప్రభుత్వము యొక్క అధికారు లవలంబించు రాజ్యాంగనీతిపైన నాధారపడియుండును.
మీకు అవకాశము లొసగదలచిన ఆ యుదారరాజ్యనీతిగురించి మీకిదివరకే చెప్పియున్నాను. ఆనీతిలోని ఉదారభావమునకుగల నిదర్శనములను చెప్పుట యొక కష్టమైనపని కాదు. సర్వసమానములును స్థిరములునగు శాసనధర్మములద్వార సమిష్ఠి ప్రయోజనమును కలిగింపజూచు ఉద్దేశములను మీరు చూచుచునేయున్నారు. మీరు ఉద్యోగములను అధికారములను పొందుట కవకాశము కల్పించుట ప్రభుత్వము తీసుకొనిన చర్యలను గురించి విచారించిన వారికి సులభముగా తెలియగలదు” అని పలికిరి (Rudimentals by George Norton, pp ii, iii; 1-18).
VII
ఇట్టి మహోన్నతమైన ఉద్దేశములతోను ఉదారభావములతోను ప్రారంభించి నార్టనుగారు ఆనాడు భారతదేశప్రజ లెరుగవలసిన రాజ్యాంగవిషయములనెల్ల సశాస్త్రీయముగను విపులముగను అందరికి తెలియునట్లును అనేక ఉపన్యాసములందు చర్చించి బోధింపసాగిరి. ప్రపంచమునందలి రాజ్యాంగనీతులు ధర్మపద్ధతులు వాని మూలసూత్రములు వివరించి, ప్రభుత్వధర్మము ప్రజలహక్కులు స్పష్టీకరించి ఇంగ్లాండుదేశ రాజ్యాంగచరిత్రమును ఇంగ్లాండుప్రజల అధికారములును ప్రభువులసభ కామన్సుసభల నిర్మాణములును చెప్పి భారతదేశమును పాలించుచున్న తూర్పుఇండియాసంఘ నిర్మాణచరిత్రయు ఈదేశము వారివశమైన చరిత్రయు ఇక్కడి పూర్వపరిపాలను చెప్పి కుంఫిణీవారి పాలకవర్గమగు డైరెక్టర్ల కోర్టువారి అధికారములు బాధ్యతలు వీనిపైన ఇంగ్లాండు పార్లమెంటు వారేర్పరచిన బోర్డు ఆఫ్ కంట్రోలు అను విచారణకమిటీవారి అధికారములు భారతదేశమున నిర్మింపబడిన ప్రభుత్వవిధానము, గవర్నరు జనరలు, గవర్నర్లు వీరి ఆలోచనాసంఘములు, వీరి అధికారములు, పైవారికి వీరిపైగల అధికారములు చక్కగా విమర్శించి చెప్పిరి. ధర్మపరిపాలనా పద్ధతులనుగూర్చి ముందుగా చెప్పి, ప్రజల ఆస్తిహక్కులు వ్యక్తిస్వాతంత్ర్యములు వానిని కాపాడుట కేర్పడిన శాసనవిధులు అవి అమలుజరుపు విచారణపద్ధతులు, ఆస్తిహక్కులకు సివిలుహక్కులకు భంగము కలిగినప్పుడు న్యాయవిచారణ చేసి నష్టపరిహార మిచ్చుట కధికారము గల సివిలుకోర్టులు, వ్యక్తులకు ప్రజలకు నష్టమును కలిగించు నేరములు జరిగినప్పుడు వానిని విచారించి దోషులను దండించు క్రిమినలుకోర్టులు, అందమలు జరుగు శాస్త్రధర్మములు విచారణ పద్ధతులు, ఇందుకేర్పడిన క్రిమినలు ప్రొసీజరును లోపములుగల ధర్మపరిపాలనా పద్ధతులవలన కలుగు నష్టములును చక్కగా వివరించి ఇట్లొక దేశముయొక్క రాజ్యాంగధర్మములు కొన్ని శాస్త్ర సిద్ధాంతములపైన నేర్పడియున్నందున ఆ సిద్ధాంతములొక శాస్త్రముగా నేర్పడియున్నవనియు ఆ శాస్త్రవిజ్ఞానము నభ్యసించుట చాల లాభకరమనియు చెప్పిరి. ఇంగ్లీషున్యాయ విచారణలోని లోటుపాటులు మేలుకీళ్ళు కోర్టువివాదము లధికమగుటను గూర్చియుచెప్పి దేశములో అమలుజరుగు న్యాయశాసనధర్మములెల్ల స్థిరములై స్పష్టములైయుండుటకు స్మృతులుగా గ్రంథస్తము చేయుట అవసరమనిరి.
నార్టనుగా రొసగిన యుపన్యాసములందు నేడు విశ్వవిద్యాలయములందు బోధింపబడు రాజనీతి ధర్మశాస్త్ర సిద్ధాంతములు రాజ్యాంగధర్మములును భారతదేశ పరిపాలనాపద్ధతులును మొదలగు ఉపయుక్తమైన విషయములన్నియు చెప్పబడినవి. ఇదిగాక ప్రజాసేవజేసి దేశోద్ధరణ చేయువారు నేర్చుకొనవలసిన రాజకీయవిషయములు ఆర్థికనీతులును చెప్పబడినవి. వీరి యుపన్యాసములు భావగర్భితములై దేశభక్తి పూరితములై వినువారియందు రాజకీయపరిజ్ఞానమును గాఢమైన దేశాభిమానమును ప్రజాసేవాపరాయణత్వమును కార్యదీక్షను ఉద్బోధించుచుండెను. ఇవి రాజకీయపరిజ్ఞానమునందు దేశాభిమానమునందు ప్రజాసేవయందును చెన్నపట్టణ ప్రజలు నేర్చుకున్న ప్రథమపాఠములని చెప్పవచ్చును. ఈయుపన్యాసములను వినినవారిలో నీగొప్ప భావములు నాటుకొని తరువాత వారు చేసిన ప్రజాసేవకు కారణములయ్యెను. అట్టివారిలో 1844 మొదలు 1868 వరకును చెన్నపట్టణమున ప్రజానాయకులై క్రైస్తవమతాచార్యుల దురంతముల నరికట్టుటకు ఆందోళనచేసి స్వధర్మరక్షణకొరకు దేశోద్ధరణకొరకు పాటుపడుచు రాజకీయ సంస్కరణములకొరకు ప్రయత్నించి తన ధనమును జీవితమును ధారపోసిన గాజుల లక్ష్మీనర్సుసెట్టిగారొకరని చెప్పినచో ఈ హిందూ లిటరరీ సొసైటీ స్థాపించిన వీరాస్వామయ్యగారును దాని ఆధిపత్యము క్రింద మహోపన్యాసములిచ్చిన నార్టనుగారును వారి మిత్రులును ఆనాడు చేసిన కృషి దేశమున కెంత యుపకారము చేసినదో తెలియగలదు.
1833 మొదలు చెన్నపట్టణమున ప్రజలలో గొప్ప వికాసము కలిగెను. సభలు తీర్మానములు చేయబడి విద్యాభివృద్ధికి గొప్ప ప్రయత్నములు జరుగసాగెను, అది కార్యరూపము దాల్చెను.
1837లో మదరాసు గవర్నరుగ వచ్చిన ఎల్‌ఫిన్‌స్టనుప్రభువు కేంద్రప్రభుత్వమువారు 1835లో నిశ్చయించిన ప్రకారము ఆంగ్లేయ విద్యావిధానమును పాశ్చాత్యప్రకృతిశాస్త్రవిజ్ఞానమును చెన్నపురి రాజధానిలో ప్రవేశపెట్టుటకు సుముఖుడుగా నుండెను. ఈ అవకాశమును జూచుకొని చెన్నపురిపౌరులు చెన్నపట్టణమున ఇంగ్లీషుకాలేజి యొకటి అవసరమనియు ప్రజల విజ్ఞానాభివృద్ధి జాతీయతకు పునాదియని తాము గ్రహించితిమనియు కేవలధర్మముపై నాధారపడిన విద్యాపద్ధతిని తాము కోరుటలేదనియు తమ శక్త్యానుసారముగా ఈ మహత్కార్యమునకు విరాళము లిచ్చెదమనియు ప్రభుత్వము స్థాపించు సంస్థల నిర్వహణమందు ప్రజలకు కొంత అధికారమును పలుకుబడియు నుండవలెననియు వ్రాసి యొక మహజరును తయారుచేసి డెబ్బదివేలమంది సంతకము చేసి జార్జినార్టనుగారిద్వారా గవర్నరు కందచేసిరి.
విద్యాభివృద్ధినిగూర్చిన విషయములందు ప్రజాభిప్రాయము తీవ్రరూపము దాల్చినదని ఈ మహజరునుగూర్చి నార్టనుగారు చెప్పిరి.
గవర్నరగు ఎల్‌ఫిన్‌స్టనుగారు జాగ్రత్తగా యోచించి ఆంగ్లసారస్వతము ప్రకృతిశాస్త్రములు తత్వశాస్త్రము నేర్పుటకు ఒక యూనివర్‌సిటీ అనబడు విశ్వవిద్యాలయమును స్థాపించుటకును దానికి విద్యార్థులను తయారుచేయుట కొరకు ఒక ఉన్నతపాఠశాలను స్థాపించుటకు నిశ్చయింపుచు 12-12-1838 తేదీన ఒక మినుటును వ్రాసెను.
VIII
పైనచెప్పిన తీర్మానప్రకారము 2-8-1839లో నొక యూనివర్‌సిటీబోర్డు చెన్నపట్టణమున నెలకొల్పబడెను. దానికి జార్జినార్టనుగారు అధ్యక్షులుగను వి. రాఘవాచార్యులు కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళె మొదలగు కొందరు భారతీయులుగూడ దొరలతోపాటు అందు సభ్యులుగను నియమింపబడిరి.
1841 సంవత్సరం ఏప్రియలు 14వ తేదీన మదరాసు కాలేజి హాలులో మదరాసు యూనివర్‌సిటి ప్రారంభోత్సవము ఎల్‌ఫిన్‌స్టన్‌ప్రభువు అధ్యక్షతక్రింద జరిగెను. ఆసభకు 1500మంది పౌరులు వచ్చిరి. అంతమంది నేటివు ప్రజలు అదివరకెన్నడును ఏ సందర్భమునను చెన్నపట్టణమున సమావేశమై యుండలేదు.
ఈ విద్యావిధానమును గూర్చి ప్రజలలో అంత యుత్సాహముండెనని కనపడెను. యూనివర్‌సిటీ అధ్యక్షుని తరఫునను గవర్నరులనబడు సభ్యుల తరఫునను నార్టనుగారు ఎల్‌ఫిన్‌స్టనుప్రభువునకు వినతిపత్రము సమర్పించెను. దానికతడు జవాబు చెప్పుచు “ఇది క్రొత్త పాఠశాలయొక్క ప్రారంభోత్సవముగాక ఒక నవీన యుగారంభమని” పలికెను. సభ కరతాళాధ్వనులతో ప్రతిధ్వనించెను.
ఇట్లు వీరాస్వామయ్యగారు నాటిన బీజము మహావృక్షమై ఫలించగా ఈ మహోత్సవమున పాల్గొనుటకు ఆయన యశఃకాయముతో నుండిననూ కృతకృత్యులైరని చెప్పవచ్చును.
1830 మొదలు 1841 వరకును గతించిన పది సంవత్సరములలో భారతదేశమునందు ఈ దేశప్రజలందు కలిగిన గొప్పమార్పును గూర్చి జార్జినార్టనుగారే 1841లో తమపుస్తకమునకు* పీఠిక వ్రాయుచు నిట్లు చెప్పియున్నారు.
[*జార్జినార్టనుగారు 1833-34 సంవత్సరములలో నిచ్చిన యుపన్యాసములు ప్రజాయాదరమునకు పాత్రములై రూడిమెంటల్సు అని పేరుతో నొక గ్రంథరూపమున 1841లో ప్రకటింపబడెను. అప్పుడు నార్టనుగారు దానికి పరిచయవాక్యములను వ్రాయుచు దేశములోను ప్రజలలోను కలిగిన మార్పునుగూర్చి వివరించిరి.]
“ఈ యుపన్యాసములిచ్చిన నాటికిని నేటికిని దేశప్రజలయందు జనసంఘమునందు నొక అత్యద్భుతమైన మార్పు వచ్చినది. బ్రిటీషు పరిపాలనముపట్ల స్నేహభావము వర్ధిల్లినది. బ్రిటీషుసంస్థలను ప్రజలు మెచ్చుకొనుచున్నారు. ప్రజలయందు జనసంఘమునందు కలిసికట్టుతనము ప్రారంభమైనది. ఒకే సామ్రాజ్యముక్రింద పౌరులుగ నుండవలెనను వాంఛ వర్ధిల్లినది. అన్నిటికన్న ముఖ్యముగా ఇంగ్లీషు విద్యవలని లాభములు ప్రజలు గ్రహించి దానిని అభివృద్ధిజేసి రాజ్యమునందు సంఘమునందు అధికారమును గౌరవమును సంపాదించుటకుగల నిజమైన అర్హతలను పొందవలెనను వాంఛ నేటివు ప్రజలందు ముఖ్యముగా పైతరగతులయందు వ్యాపించినది. ఈ మార్పును కాదనుటకు వీలు లేదు. ప్రజల ఆశయములను తృణీకరించుటకును వీలు లేదు. మర్యాదస్థులైన డెబ్బదివేలమంది నేటివులు ఒక్క అర్జీలో ఏకీభావము వహించి విద్యావిధానమునకు ప్రభుత్వాదరణమును పొందుటకు ప్రయత్నించుటయే ప్రజలలో ఒక నూతనభావ ముదయించినదనుటకు సాక్షి. ప్రజల కోర్కెలకు అనుగుణముగా తగినంత వేగముతో విద్యాభివృద్ధి జరిగి విద్యాసంస్థలు వర్ధిల్లకపోయినను భారతదేశప్రభుత్వముయొక్క సంరక్షణ క్రిందను స్వతంత్రసంఘములును వ్యక్తులును ఆంగ్లసారస్వతమును పఠించు విద్యార్థులు వర్ధిల్లుచున్న ఒక క్రొత్త తరమును సృష్టించినవి. ఈ గొప్ప యాశయములు కలిగి జాతీయాశయములు వాంఛించుచున్న దేశప్రజలకును ఉపయుక్తమయిన ఆంగ్లవిద్యాశాఖలయందు కృషిచేయుచు పైకి వచ్చుచున్న యువజనులకును ఈ యుపన్యాసములయందు వివరింపబడిన యంశములకన్న తమదేశమునకు ఎక్కువ ఉపకారమును కలిగించి విషయములు లేవు” అని వ్రాసిరి.
నార్టనుగారు చెప్పినట్లు 1830-1841 సంవత్సరముల మధ్య భారతదేశ రాజకీయ సాంఘిక మతాచార వ్యవహారములందొక గొప్ప మార్పు వచ్చినమాట వాస్తవము. ఇది వచ్చుటకు నార్టను, వీరాస్వామయ్య, రామమోహనరాయి మొదలగువారు చేసిన ప్రజాసేవ యొక కారణమే. అయితే ఈ మార్పుయొక్క నిజస్వభావమును గ్రహింపవలెనన్నచో ఇంగ్లీషు కుంఫిణీ ప్రభుత్వము వలన రాజకీయ ఆర్థిక సాంఘిక మత విషయములందు వచ్చిన మార్పులు, పాశ్చాత్య నాగరికత, పరిపాలక జాతియొక్క జీవితవిధానము, క్రైస్తవమత ప్రచారము, ఇంగ్లీషు సారస్వతము, ప్రకృతిశాస్త్రవిజ్ఞానము లోనగు వానివలన కలిగిన భావపరివర్తనల చరిత్రను చర్చించవలసి యుండును. అనగా బ్రిటీషు యుగారంభమునాటి భారతదేశ చరిత్రనే చదవవలెను.
ఇంగ్లీషువారితోడి పరిచయము, స్నేహము, ప్రజలందు వారిరుచులయందు మర్యాదలందు అనేకమైన మార్పులు కలిగించుచుండెను. ఇంగ్లీషువారివలె ఇండ్లను కారింతియన్ స్తంభములతో కట్టుట, వాటిని కుర్చీలు బల్లలు వేసి అలంకరించుట, చక్కని గుఱ్ఱపుబండ్లయందు షికారుకుబోవుట, పిల్లలకు ఇంగ్లీషు లాగు చొక్కాలు వేయుట, టోపీలను బూట్సులను వేయుట, కులాచారములను వీడుట మెల్లగా ప్రారంభమయ్యెననియు, ఒకటి రెండు వార్తాపత్రికలు కూడ బయలుదేరి రాజకీయములను చర్చించుచుండెననియు 1823 డిశంబరులో బిషపు హెబరు వ్రాసినాడు.
ఇంగ్లీషుభోగద్రవ్యములను ఉపయోగించుట ప్రారంభమైనదని విలియం బెంటింకు 30-5-1829లో వ్రాసినాడు. సీమసారాయముల నుపయోగించుట, వాచీలు గడియారములు, గుఱ్ఱపుబండ్లు నుపయోగించుటను గూర్చి హోల్టుకొకంజీ కామన్సుసభలో 23-2-1832లో సాక్ష్యమిచ్చినాడు.
(సశేషం)
[ప్రథమ ప్రచురణ: కృష్ణాపత్రిక, శ్రీ విషు సంవత్సర చైత్ర మాసపు (ఏప్రిల్, 1941) సంచికలలో. ఈ వ్యాసాన్ని అందజేసిన దిగవల్లి రామచంద్రగారికి మా కృతజ్ఞతలు – సం.
ఇంగ్లీషు చదువుల చరిత్ర 3
రచన: దిగవల్లి వేంకట శివరావు
మార్చి 2020
IX
ఐరోపాదేశపు సారస్వతమును పాశ్చాత్య ప్రకృతి శాస్త్రవిజ్ఞానమును కలకత్తాలోని నేటివు యువజన సంఘమునందు నూతనభావములను వికారములను కలిగించెను. వారు పూర్వమునుండి అలవాటుపడిన ప్రాతపంథలనువీడి ప్రాత సిద్ధాంతములను విసర్జించి క్రొత్త ఆలోచనలతో విపరీతపుబుద్ధులతో ప్రవర్తింపసాగిరి. శాస్త్రప్రమాణములు ప్రయోగములును అనుశృతములైన విశ్వాసములను పోగొట్టి మతమునందును ఆచారములందును అపనమ్మకము కలిగించి సంఘ మర్యాదలందు నీతిధర్మములందు గౌరవమును పోగొట్టి ఇంగ్లీషు చదివిన వారివలన ఒక క్రొత్త ప్రచారము చేయించుచుండెను. కలకత్తాలోని ఇంగ్లీషుచదువులు చెప్పు హిందూకాలేజీ విద్యార్థులు విజృంభించి దేశము యొక్క మతమును సంఘమును ఆచారములను తీవ్రముగా విమర్శింపసాగిరి. వర్ణాశ్రమధర్మములను భోగ్యాభోగ్య ఆహారనియమములను తృణీకరించి మతాచారములు బహిరంగముగా నిరసింపసాగిరి. అన్ని విషయములందును పాశ్చాత్యపద్ధతులే శ్రేష్టములను భావముతో ప్రవర్తింపుచుండిరి.
క్రొత్తగా నాంగ్లేయవిద్య నేర్చినవారెల్లరు నీ పాశ్చాత్య విద్యావిధానమును భారతదేశమున నింకను బాగా వ్యాపింపజేయవలెననియు ప్రచారము చేయుచుండిరి. (Life and Experiences of a Bengali Chemist – P. C. Ray, Vol. II P. 333-342; Keshub Chunder Sen; P. C. Muzumdar: Rise and Fulfilment of British Rule – Thompson and Garratt, P. P. 309-311)
ఈ దేశప్రజల కింగ్లీషువిద్యయం దభిరుచి గలుగుటను గనిపెట్టి క్రైస్తవమిషనరీలు అనేక ఇంగ్లీషు పాఠశాలలు కాలేజీలు స్థాపించి మెల్లగా బాలురకు తమ మతాచారవ్యవహారములందు హేయభావము గలిగించి బాలుర మనస్సులకు క్రైస్తవభావముల నెక్కించుచుండిరి. దీనిఫలితముగా బాలురు క్రైస్తవమతము నవలంబించినను అవలంబింపకపోయినను ముందుగా హిందూమతాచారములందు నమ్మకము గోల్పోవుదురని వారి విశ్వాసము. ఇది నిజమయ్యెను. చాలామంది యువకులలో నాస్తికభావము లుదయించెను. ఎట్టకేలకు కొందరు క్రైస్తవమతమున గలిసిరి. కలకత్తాలో అలెగ్జాండర్ డఫ్ అను మిషనరీ 1830లో వచ్చి చేసిన తీవ్రమైన కృషివలన కులీనకుటుంబమునకు జెందిన కృష్ణమోహన బెనర్జీగారు 1832లో క్రైస్తవుడయ్యెను. దీనితో భారతదేశమున నొక క్రొత్త సమస్య ప్రారంభమయ్యెను.
క్రైస్తవమతాచార్యులు బాలురనుచేరదీసి క్రైస్తవులుగ జేయుచుండుట బాలురదలితండ్రులు వారిని వశము చేయమని సుప్రీముకోర్టులలో హెబియస్ కార్పసు కేసులు దాఖలుచేయుట, క్రైస్తవమతాచార్యులు వానిని ప్రతిఘటించుటయు ప్రారంభమయ్యెను*. క్రైస్తవులైన యువకులభార్యలను బలవంతముగా వారివశము చేయించుటకును మతాచార్యులు ప్రయత్నించిరి. క్రైస్తవమతమున జేరినవారికి హిందూ సమష్టికుటుంబమునగల ఆస్తిహక్కులు పోవుటవలన క్రైస్తవులుగ జేరకుండుటజూచి క్రైస్తవమతాచార్యులు ప్రభుత్వమువారిని ప్రోత్సహించి అట్టి హక్కులుపోకుండ 1832లో వంగ రాష్ట్రమున శాసింపజేసిరి. ఈ శాసనమును తరువాత 1850లో దేశమునంతటను అమలుపరచిరి.
[* ఇటువంటి కేసులు రెండు 1843లో బొంబాయి సుప్రీముకోర్టులో వచ్చినప్పుడు దేశీయులందు చాలా అలజడి ఆందోళనము కలిగెననియు, తమమతమున గలిసిన క్రైస్తవులహక్కులను కాపాడుటకొరకు వారి పక్షమవలంబించి పనిచేయసాగిన మిషనరీలయందును తీవ్రమైన ఆవేశము కనబడినదనియు బొంబాయి సుప్రీముకోర్టు జడ్జిపనిచేసిన సర్ ఎర్‌స్కిన్‌ఫెర్రీగారు తరువాత 1853లో వ్రాసియున్నారు. see: Cases illustrative of Oriental life decided in Supreme Court of Bombay, Sir Erskine Ferry. Page 520.]
భారతదేశమున క్రైస్తవమత ప్రచారావశ్యకతనుగూర్చి క్రైస్తవమిషనరీలు ఇంగ్లాండుదేశమునగూడ ప్రచారము చేయగా 1833లో కుంఫిణీవారికి పార్లమెంటువారు మరల పట్టానిచ్చు సందర్భమున భారతదేశమందు క్రైస్తవప్రచారము చేయుటలో మిషనరీలకుగల ఆటంకములనన్నిటిని తీసివేయుటకు వలసిన ఏర్పాటులనుజేసిరి.
భారతదేశ ప్రభుత్వమున మిషనరీల పలుకుబడి హెచ్చెను. అంతట గవర్నరులు ప్రభుత్వసభ్యులు కలెక్టర్లు జడ్జీలు వీరికి సర్వవిధములైన సాయములను జేయుచు వీరిని ప్రోత్సహింపసాగిరి. క్రైస్తవులైనవారి కుద్యోగములిచ్చుట ప్రారంభించిరి. దేశీయుల మతముతో జోక్యము కలిగించుకొనమనియు మతవిషయకమైన విచక్షణచూపమనియు కుంఫిణీవారు వాగ్దానము చేసియున్నను అందుకు విరుద్ధముగా ప్రవర్తింపసాగిరి.
ఇట్లు క్రైస్తవమతాచార్యులును భారతదేశమును పాలించు కుంఫిణీయుద్యోగులును ఏకమై హిందూమతముపైన దండెత్తి దానిని నిర్మూలించుటకు ప్రయత్నించుచున్నారను భావము ప్రజలలో వ్యాపించగనే స్వధర్మ రక్షణము చేసికొనవలెనను తలంపు కలిగెను. అంతట వంగరాష్ట్రమున అంతవరకు బ్రహ్మసభయనియు ధర్మసభయనియు రెండు పక్షములుగా చేరి పోరాడుకొనుచున్న హిందూ సంఘసంస్కరణవాదులు సనాతనధర్మవాదులు నీవిపత్సమయమున నేకమైరి. వారి నాయకులగు దేవేంద్రనాథ ఠాకూరుగారును రాజారాధాకాంతదేవుగారును ఈ విషయమున ఏకీభావము వహించి సభలు చేసియు తీర్మానములు గావించియు పై యధికారులకు మహజరులంపియు, పత్రికలందు విమర్శించియు ఆందోళనము చేయసాగిరి$. తరువాత 1861లో బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ అను పేరుతో నొక జాతీయ ప్రజాసంఘము స్థాపించబడి రాజ్యాంగ సంస్కరణములకొరకు ఆందోళనము చేయసాగెను.
[$ see: Life of Alexander Duff-George Smith (1879) Vol. II Pp. 59-71; see: Rise and fulfillment of British Rule in India—Thompson and Garrett, PP 310-311.]
X
హిందూదేశమతాచారములతో నెట్టిజోక్యము కలుగచేసికొనమనియు, అన్ని మతములను సమానముగా జూచెదమనియు క్రైస్తవమతమందు ప్రజలను కలుపుకొన బ్రయత్నించమనియు కుంఫిణీవారు మొదటినుండియు వాగ్దానము చేయుచుండిరి. ఈ సూత్రము పార్లమెంటువారుచేసిన చట్టములందుకూడా శాసించబడెను. కాని ఇంగ్లీషుప్రభుత్వము క్రమక్రమముగా బలవంతమైనకొలదియు నీ వాగ్దానములను తృణీకరించి క్రైస్తవమత పక్షపాతము చూపసాగెను. క్రైస్తవమత ప్రచారముచేయు మిషనరీలకు ప్రబుత్వమన్నివిధముల సహాయము చేయసాగెను. ఈ మిషనరీలు పాఠశాలలు స్థాపించి విద్యాబోధనముద్వారా క్రైస్తవమతమును ప్రచారము చేయదలచిరి. దీనివలన బాలురమనసులు మరల్పగలుగుచుండిరి. త్వరలోనే కొందరినిట్లు క్రైస్తవులుగజేసిరి. పాఠశాలలలో పరీక్షలందుత్తీర్ణులైనవారికే ప్రభుత్వోద్యోగము లివ్వబడునని 1844లో శాసింపబడుటతో క్రైస్తవ పాఠశాలాధికారుల పుణ్యము పుచ్చెను. చాలామందిని వీరు క్రైస్తవమతమున గలుపసాగిరి. దీనిని గూర్చి ప్రజలెంత మొరలుపెట్టుకొన్నను ప్రభుత్వమువారు కలిపించుకొనరైరి. న్యాయస్థానములందు కూడా క్రైస్తవమతపక్షపాతము ప్రబలి న్యాయము దొరకకుండెను.
1842లో మార్క్విస్ ఆఫ్ ట్వీడ్‌డేలు ప్రభువు మద్రాసు గవర్నరయ్యెను. ఇతనికి క్రైస్తవమతాచార్యులపైన చాలనభిమానముండెను. క్రైస్తవమతాభిమానియైన జాన్‌ఫ్రయ్యర్ తామస్ అనునాయన 1843లో చెన్నపట్టణ ప్రభుత్వములో రివిన్యూ శక్రటరీ యయ్యెను. తరువాత నతడు క్రమక్రమముగా ప్రభుత్వమునందు పెద్ద యుద్యోగములు చేయుచు 1850లో ప్రధాన ప్రభుత్వ కార్యదర్శియయ్యెను. ఇతడు తన యావచ్ఛక్తిని వినియోగించి క్రైస్తవ మిషనరీలకు సాయము చేయసాగెను. ఇట్లే చెన్నపట్టణమున పరమోన్నత న్యాయస్థానమగు సుప్రీము కోర్టులో 1844లో న్యాయాధిపతియైన సర్ విలియం బర్టనుగారు క్రైస్తవ మతమునందు గాఢమైన అభిమానము కలిగియుండిరి. ప్రభుత్వమునందలి పెద్ద అధికారులందరు ఆనాటి క్రైస్తవ సంఘములందు గౌరవోద్యోగములు కలిగియుండిరి. పెక్కుమంది కలెక్టరులు జిల్లాజడ్జీలు మిషనరీల చెప్పుచేతలలో నుండిరి. ఒకరిద్దరు నిష్పక్షపాతముగా నున్నందులకుద్యోగములందు దెబ్బతినిరి. అట్టివారిలో సదరుకోర్టులో జడ్జియగు మాల్కలంవెలిన్‌గారొకరు. ఈ క్రైస్తవ పక్షపాతులగు నుద్యోగులు తమ అధికారములందు చూపు క్రైస్తవమత పక్షపాతము, చేయుచుండిన అన్యాయములు, ప్రజలను పెట్టుచుండిన నిర్భంధములు మితిమీరిపోగా దేశప్రజలలో తీవ్రమైన అశాంతి యుదయించెను. హిందువులు క్రైస్తవ మతమున జేరినచో వారి ధర్మశాస్త్రమును బట్టి సమష్టి కుటుంబములందలి ఆస్తి హక్కులు పోవుట క్రైస్తవ మత ప్రచారమున కాటంకము కలిగించు చున్నందున 1832 లోనే వంగ రాష్ట్రమున నీ యడ్డంకి తొలగించు నొక శాసనము చేయించిరి. దీనిని దేశమంతట ప్రవేశపెట్ట వలయునని మిషనరీలు సంకల్పించిరి. అంతట చెన్నపట్టణ ప్రజలలో కలవరము కలిగెను. దీనినిగూరి 1845 సం|| ఏప్రిలు నెలలో అసమ్మతి సభలు చేయగా చెన్నపట్ట్ణ ప్రభుత్వమువారును కేంద్ర ప్రభుత్వమువారును కొన్ని ఉత్తర ప్రత్యుత్తరములు జరిపి అప్పటికది మానిరి.
చెన్నపట్టణమున యూనివర్సిటీ యనుపేరున 1841లో స్థాపించబడిన ప్రభుత్వ పాఠశాలయందు మతముతో సంబంధములేని ఆంగ్లేయ లౌకిక విద్యయే గఱపుటకు నిశ్చయింపబడియుండెను. అయితే ఏదో విధముగా దానిలో బైబిలు ప్రవేశపెట్టవలెనని మిషనరీలు దృఢనిశ్చయులైరి. ఆ పాఠశాల విద్యార్థులను పరీక్షించుటకు ప్రభుత్వమువారీ మిషనరీలనే నియమించుట ప్రారంభింపగా వీరు బాలురను ప్రపంచజ్ఞానములను గూర్చి ప్రశ్నించుటయను మిషపైన బైబిలును గూర్చియు క్రైస్తవమతమును గూర్చియు ప్రశ్నించుచు జవాబు చెప్పలేనివారిని పరీక్షలందు తప్పించి ఉద్యోగములు లేకుండ జేయసాగిరి. దీనినిగూర్చి ప్రజలు మొఱపెట్టగా బైబిలు నొక పాఠ్యపుస్తకముగా చదివించినచో నీబాధ యుండదని జవాబు చెప్పిరి. వీరి సలహాను పురస్కరించుకొని మద్రాసు గవర్నరు ట్వీడుడేలుగారు బైబిలును పాఠశాలలో నొక క్లాసుపుస్తకముగా ప్రవేశపెట్టుటకు 1846 సంవత్సరం ఏప్రిలు 28 తేదీన తీర్మానించెను.
క్రైస్తవమత ప్రచారకులలో అతి సమర్థుడును ప్రతిభాశాలియనియు పేరుపొందిన జావ్‌యాండరుసన్ అను యువకుడు చర్చి ఆఫ్ స్కాట్లండు మిషనరీగా చెన్నపట్టణమునకు వచ్చి 1837వ సంవత్సరం ఏప్రిలు 3వ తేదీన నల్లవారు నివసించు (నేడు జార్జిటవును అని వ్యవహరింపబడు) బ్లాక్ టవునులో నొక పాఠశాలను స్థాపించెను. అక్టోబరు 1838 నాటికి ఈ పాఠశాలలో 270 మంది విద్యార్థులుండిరి. వీరిలో చాలమంది హిందువులు. ఇట్టి స్థితిలో నీయాండర్‌సన్ తన పాఠశాలలో ముగ్గురు అస్పృశ్యులను చేరుచుకొనెను. అంతట హిందూబాలుర తలిదండ్రులు తమ అసమ్మతిని తెలిపి హరిజన బాలురను పంపివేయమనిరి. ఆండరుసను అంగీకరించలేదు. అంతట నూరుమంది పిల్లల నొక్కసారిగ మాన్పించిరి. ఇట్లు మొదటి హిందూక్రైస్తవ యుద్ధము ప్రారంభమయ్యెను గాని కొన్నాళ్లలో నీ కలవరము సర్దుమణిగి పాఠశాల అభివృద్ధిగాంచసాగెను.
1840లో యాండర్‌సనుదొర పాఠశాలలో చదువుకొనిన రాజగోపాల్, వెంకట్రామయ్య, యతిరాజులు అను హిందూబాలురను క్రైస్తవ మతమున కలుపగా హిందూప్రజలలో గొప్ప భయాశ్చర్యములు కలిగెను. ప్రజలమూకలు పాఠశాలను ముట్టడించెను. ఆండర్‌సను తన పెద్ద కర్రతోవచ్చి యాజనమును పారదోలెను. మరల పాఠశాలనుండి చాలమంది హిందూబాలురను తలిదండ్రులు మాన్పించిరి. అట్లుమానినవారిలో తరువాత చెన్నపట్టణములో ప్రముఖులైన అమరవాది శేషయ్యశాస్త్రిగారొకరు. ఇది వీరి జీవితచరిత్రమున వర్ణింపబడినది.
XI
రాజగోపాలుడు క్రైస్తవమతమున కలిసినప్పుడు, ఈతనివ్యవహారము చెన్నపట్టణము సుప్రీముకోర్టులో విచారణకువచ్చెను. నీకేదో కొన్ని లాభములు కలిగింతుమని చెప్పినందువలననే నీవు క్రైస్తవుడవైతివికాదా యని యాతనినడుగగా తాను ఏసుక్రీస్తునందుగల నమ్మకమువలననే క్రైస్తవుడనైతినని అతడు బదులు చెప్పెను. 1846లో చెన్నపట్టణములో ముగ్గురు యువకులు క్రైస్తవమతమునగలియ ప్రయత్నింపగా ప్రజలలో కొంత అశాంతికలిగెను. వారిలో నొకరినిగూర్చిన కేసు సుప్రీముకోర్టులో విచారణకువచ్చెను. ఆబాలుడు విచక్షణజ్ఞానము కలిగినవయస్సున నున్నాడనియు తాము జోక్యము కలిగించుకొనమనియు కోర్టువారనిరి. బాలుని తండ్రికి వశముచేయక మిషనరీలు బండిలో తీసుకొని పోవుచుండగా ప్రజలు ముట్టడించి కొంత దౌర్జన్యముచేసిరి.
1847లో నొక ఆడపిల్లను మిషనరీలు అక్రమనిర్బంధములో నుంచినారని సుప్రీముకోర్టులో ఫిర్యాదు చేయబడెను. అంతట యిరువురు క్రైస్తవమతాచార్యుల సమక్షమున తానామెను పరీక్షించితిననియు ఆమెకు పండ్రెండేండ్లుకలవని కుంఫిణీ వైద్యాధికారి ఒక ధ్రువపత్రమును వ్రాసియిచ్చినందున కోర్టువారామెను మిషనరీల స్వాధీనము చేసిరి.
1847 లో 5మంది ఆడుపిల్లలు క్రైస్తవులుగ చేయబడిరి. ఈ క్రైస్తవమతవిజృంభణము చూడగా దేశీయ జన సంఘమునందు గొప్ప కలవరము పుట్టెను.
1850వ సంవత్సరం ఏప్రిలు 11వ తేదీన క్రైస్తవ మతమున కలిసినవారికి హిందూ కుటుంబములందలి ఆస్తి హక్కులుపోవని ఒక శాసనము చేయబడగా చెన్నపట్టణమున ప్రజలయందు అశాంతిగలిగెను. ఈ శాసనము మతస్వాతంత్ర్యమును ప్రసాదించు గొప్ప చట్టమని సుప్రీముకోర్టులో జడ్జిగానుండిన సర్ విలియం బర్టనుగారు బహిరంగముగా నుద్ఘోషించిరి.
శీఘ్రముగనే క్రైస్తవమతమున గలిసిన హిందువుల హక్కులనుగూర్చి యీ బర్టనుగారొక పక్షపాతపుతీర్పు నొసగిరి. క్రైస్తవమతమున గలిసిన శ్రీనివాస యనునాతని భార్య 15 ఏండ్ల వయస్సుగల లక్ష్మి అమ్మాళ్ అనునామె తన భర్తతో కాపురముచేయ నిరాకరింపగా భర్తపెట్టుకొనిన హెబియస్‌కార్పస్ అర్జీనిబట్టి 7-6-1851 తేదీన ఆమెను బర్టనుగారి కోర్టులో హాజరుపరచిరి. క్రైస్తవుడయినను భర్త ననుసరించుట నీ విధియని బర్టనుగారామెకు బుద్ధిచెప్పి భర్తదగ్గరకు వెళ్ళమనిరి. ఆమె నిరాకరింపగా బర్టనుగారు ఆంగ్లేయ కాన్‌స్టేబుల్సులో నొకనిచే నామెను తన గదిలోనున్న ఆమె భర్తదగ్గరకు బలవంతముగ పంపించెను. అంతట ఆ పిల్లతండ్రి గోలపెట్టెను. మేనత్త అర్చుచు తలవెంట్రుకలు పీకుకొని పిల్లదగ్గరకు పోబోయెను. కాని ఇద్దరు మనుష్యులామె నాటంకపరచిరి. కోర్టు ఆవరణలో చేరిన 500 మంది బ్రాహ్మణులు కేకలువేసి గత్తరచేయసాగిరి. అంతట వారిని బలవంతముగా చెదరకొట్టిరి. ఇట్టి దృశ్యములు ఆ కాలమున సర్వసామాన్యమైపోయెను.
బొంబాయి సుప్రీముకోర్టులో నిటువంటి వ్యవహారమే విచారణకురాగా సద్ధర్ముడగు సర్ ఎర్‌స్కిన్ పెర్రీ అను న్యాయాధిపతి ఇట్లనెను. “తురుష్కదేశమున నే యాంగ్లేయుడో మహమ్మదీయుడై నలుగురు భార్యలను స్వీకరింపదలవగా అతని క్రైస్తవభార్య యాతని ననుసరింప నిరాకరించెనేని బలవంతముగ నామెను భర్తవద్దకు పంపవచ్చునా? తెల్లవారికొక ధర్మమును నల్లవారికొక ధర్మమును నుండగూడదు” అని తీర్మానించుచు బర్టనుగారి తీర్పును తీవ్రముగ ఖండించి క్రైస్తవుడైన భర్తకు అతని హిందూభార్యను వశముచేయ నిరాకరించెను. (చూడుడు: యక్సుపార్టి బలరాం బొంబాయి సుప్రీంకోర్టు 25-9-1852. Cases Illustrative of Oriental Life – Sir Erskine Perry page 516.)
వంగ రాష్ట్రమునందు స్వధర్మరక్షణకొరకు పనిచేసిన దేశీయనాయకులవలెనే చెన్నపట్టణమున గాజుల లక్ష్మీనరుసు సెట్టిగారును 1844 లో) చెన్నపట్టణ స్వదేశ సంఘముకు క్రెసెంటు అను పత్రికను స్థాపించి సభలు చేసి తీర్మానములు మహాజరులును గవర్నరుకును ఇంగ్లాండులో డైరెక్టర్లకును పార్లమెంటునకును పంపి ఆందోళనచేయసాగిరి.
అన్ని మతములను సమానముగా చూచెదమనియు క్రైస్తవమతమునకు ప్రత్యేక ప్రోత్సాహమొసగమనియు పూర్వము కుంఫిణీప్రభుత్వముచేసిన వాగ్దానములకు విరుద్ధముగా గవర్నరు ప్రవర్తించుట, మతబోధకులు ప్రభుత్వోద్యోగుల సాయముతో ప్రజలను తమ మతములో గలుపుకొనుటకొరకు ప్రజలను నిర్భంధించుచుండుట, దానికి ప్రభుత్వమువారు తోడ్పడుచుండుట, క్రైస్తవమతమున జేరుడని బాలురు పరీక్షలందుత్తీర్ణులు గాకుండగను వారికుద్యోగములు రాకుండగను మత బోధకులుద్యోగులతో కుట్రలుచేయుచుండుట చెన్న రాజధానిలో వివిధ జిల్లాలలో ఇంగ్లీషుపాఠశాలల నేర్పరచి జనసామాన్యమున విద్యాభివృద్ధి గావింపకుండుట న్యాయస్థానములందు తరచు అన్యాయములే జరుగుచుండుట గురించి 1844-1846 లో ఆందోళనచేసిరి.
తరువాత ఏర్పడిన బ్రిటిష్ ఇండియన్ ప్రజాసంఘమువలెనే చెన్నపట్టణ స్వదేశసంఘముకూడ రాజ్యాంగ సంస్కరణలను కోరసాగెను. కుంఫిణీపరిపాలనమున ప్రజలు దరిద్రులై అజ్ఞానాంధకారమున మునిగి అనారోగ్యమున పడియుండుట, రాకపోకలకు రోడ్లకు పల్లపుసాగుకు ఎట్టిసౌకర్యములుగాని లేకుండుట, పన్నులత్యధికములై రైతులు భరింపలేకుండుటయు, పన్నులివ్వలేనివారిని నరక భాధలను భరింపజేయు కలెక్టరుల నిరంకుశత్వము, అధికారుల లంచగొండితనమును, కోర్టుల యప్రయోజకత్వమును, క్రైస్తవమతబోధకుల దురాగతములను, కుంఫిణీవారి దుష్పరిపాలనమును వర్ణించుచు 1852లో పార్లమెంటుకు మహజరులంపిరి. దేశపరిపాలనమున దేశీయ ప్రజాప్రతినిధులకు పలుకుబడి కలిగింపవలెననియు గోరిరి.
ఇట్లు వంగ రాష్ట్రమునను చెన్నరాజధానియందును గూడ ముందు విద్యాభివృద్ధికొరకు ప్రారంభమైన ప్రచారము ఆందోళనము తరువాత స్వధర్మ రక్షణ కొరకును, పిమ్మట పరిపాలనలోని యన్యాయములను బాపుటకొరమును, అటుతరువాత రాజ్యాంగ ‘సంస్కరణ’ల కొరకును చేయబడిన జాతీయోద్యమముగా పరిణమించినది. ఇది భారతదేశచరిత్రలో సువర్ణాక్షరములతో లిఖించి శాశ్వతముగా స్మరింపదగిన ఆశ్వాసము.
(సమాప్తం)
Comments
Post a Comment